కొవిషీల్డ్ కి ఓకే.. కొవాక్సిన్ కి బ్రేక్..?

దేశవ్యాప్తంగా టీకా పంపిణీకి కౌంట్ డౌన్ మొదలైన వేళ.. కొవాక్సిన్ టీకా పంపిణీకి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం హడావిడి నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు…

దేశవ్యాప్తంగా టీకా పంపిణీకి కౌంట్ డౌన్ మొదలైన వేళ.. కొవాక్సిన్ టీకా పంపిణీకి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం హడావిడి నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు సమసిపోకముందే.. ఆ టీకా పంపిణీలో కన్సెంట్ (అంగీకార పత్రం) అడుగుతారనే అంశం ఆందోళన కలిగిస్తోంది.

సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ అన్ని ప్రయోగ దశలు పూర్తి చేసుకుంది కాబట్టి దాని పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే కొవాక్సిన్ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకముందే అత్యవసర అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఈ టీకా వేసేటప్పుడు గ్రహీత నుంచి అంగీకార పత్రం తీసుకోవడం తప్పనిసరి అయింది. అయితే ఇలాంటి అంగీకార పత్రాలు అడిగితే ఎవరైనా టీకా వేయించుకోడానికి ఎందుకు ముందుకొస్తారనేదే ప్రశ్నార్థకం.

ఇటీవల కేంద్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయం చర్చకు వచ్చిందని తెలంగాణ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు అంగీకార పత్రం కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య-ఆరోగ్య శాఖ స్పష్టం చేయడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. అందుకే తొలి విడతలో కేవలం కొవిషీల్డ్ టీకాలు మాత్రమే పంపిణీ చేయబోతున్నారు

ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొవాక్సిన్ టీకాలు తగినన్ని సరఫరా కాకపోవడంతో.. ముందుగా కొవిషీల్డ్ టీకాలను మాత్రమే పంపిణీ చేస్తామని తెలిపారు అధికారులు.

తొందరపాటు నిర్ణయమా..? తప్పుడు నిర్ణయమా..?

దేశవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుతున్న వేళ.. టీకా విషయంలో కేంద్రం తొందరపడిందనే వాదన ఉంది. ఇతర దేశాల్లో కూడా అనుమతి పొందిన కొవిషీల్డ్ కి భారత్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎక్కడా అభ్యంతరాలు రాలేదు, అదే సమయంలో భారత్ బయోటెక్ కొవాక్సిన్ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకముందే వినియోగ అనుమతి ఇవ్వడం మాత్రం కాస్త సంచలనంగా మారింది.

రాజకీయ పక్షాలు కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన వేళ.. ఆ వ్యవహారాన్ని శాస్త్రవేత్తల వైపు మళ్లించారు మోదీ. శాస్త్రవేత్తలదే తుది నిర్ణయం అని, టీకా అనుమతి విషయంలో రాజకీయ జోక్యం లేదని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు సహా.. సామాన్య ప్రజలెవరూ ప్రధాని మాటల్ని విశ్వసించలేదు.

కొవిషీల్డ్ కి అనుమతిచ్చిన 24 గంటల వ్యవధిలోనే కొవాక్సిన్ కి అత్యవసర అనుమతినివ్వడం అందరికీ తెలిసిన విషయమే. తమ టీకా మంచిది అంటే తమ టీకా మంచిది అని రెండు కంపెనీలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకుని వెంటనే తూచ్ అంటూ కలిసిపోయాయి కూడా. 

రాజకీయ జోక్యం లేకుండా ఇలాంటి వివాదాలు అంత తేలిగ్గా సమసిపోవు. పోనీ కొవాక్సిన్ అంత నిఖార్సైన టీకాయే అనుకుంటే.. అంగీకార పత్రం అనే విషయం బయటకు రావడమే పెద్ద తప్పు. ఇంతకీ కేంద్రం తీసుకుంది తొందరపాటు నిర్ణయమా? అసలు పూర్తిగా తప్పుడు నిర్ణయమా? అనేది తేలాల్సి ఉంది.

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్ 

ఈ సంక్రాంతి అల్లుడు నేనే