టీడీపీ వ్యూహకర్త రాబిన్‌శర్మపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు అసహనంగా ఉన్నారా? అనే ప్రశ్నకు “ఔను” అనే సమాధానం వస్తోంది.
ఆదిలోనే హంసపాదు అనే నానుది చందాన వ్యూహకర్త నియామకం మేలు చేయకపోగా, కీడు తలపెడుతోందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల ఏపీ రాజకీయాల్లో మత రాజకీయాలు ఊపందుకున్నాయి. అయితే అనూహ్యంగా టీడీపీ మత రాజకీయాలను నెత్తికెత్తుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఒక్కసారిగా చంద్రబాబులో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తే ….వ్యూహకర్త రాబిన్‌శర్మ ఇచ్చిన సలహానే అని తేలింది. ఈ నేపథ్యంలో టీడీపీ వ్యూహం బెడిసికొట్టడంతో రాబిన్‌శర్మపై చంద్రబాబు అసహనంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) టీంలో రాబిన్‌శర్మ గతంలో కీలకంగా పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ టీం పన్నిన సోషల్ ఇంజనీరింగ్ ఉచ్చులో టీడీపీ ఇరుక్కుని చావుదెబ్బ తిన్నదనే బలమైన వాదన ఉంది.
పీకే టీం నుంచి రాబిన్‌శర్మ బయటికొచ్చి సొంతంగా ‘షోటైమ్ కన్సల్టింగ్’ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ తమ పార్టీ వ్యూహకర్తగా రాబిన్‌శర్మను నియమించుకుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ తలను దుండగులు నరికేసిన ఘటనలో చంద్రబాబు దూకుడుగా వ్యవహరించారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బాబు మతపరమైన విమర్శలు చేసి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఒకింత ఆశ్చర్యం, ఆందోళనకు గురి చేశారు.
జగన్‌ను క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా, హోంమంత్రి, డీజీపీలను క్రిస్టియన్లగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల టీడీపీ క్రిస్టియన్ నాయకులంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి, చంద్రబాబు మారిన ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు చంద్రబాబులో మతం ప్రాతిపదికన వచ్చిన ధోరణి ప్రమాదకరమని, ఇప్పుడు క్రిస్టియన్లు, రేపు తాము టార్గెట్ అవుతామని ముస్లిం మైనార్టీల్లోనూ అభద్రత నెలకుందనే సంకేతాలు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. పైపెచ్చు హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బాబు విమర్శలు దోహదం చేస్తాయనే సమాచారం టీడీపీని కలవరపెడుతోంది.
కానీ మైనార్టీలు, అణగారిన వర్గాల్లో బాబు మారిన రాజకీయ పంథా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యూహకర్త రాబిన్‌శర్మ దిశానిర్దేశం తమను తప్పుదారి పట్టించిందనే అభిప్రాయం బాబులో కలిగిందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికలో రాబిన్‌శర్మ వ్యూహా ఫలితాలను బట్టి, అతన్ని కొనసాగించాలా? వద్దా? అని అధినేత నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.