పడుతూ లేస్తూ సాగుతున్న హరిహర వీరమల్లు సినిమాకు ఇప్పుడు మరోసారి డైలమాలో పడింది. ఎలాగోలా షూటింగ్ స్టార్ట్ చేశాం అని సంబర పడేలోపే, రిలీజ్ డేట్ టెన్షన్ పట్టుకుంది. ఏదైనా పండక్కి సినిమాను విడుదల చేయాలనేది యూనిట్ ప్లాన్. వాళ్ల ముందు ఉన్న ఆప్షన్లు రెండు. ఒకటి దసరా, రెండోది సంక్రాంతి.
ముందుగా షూటింగ్ అప్ డేట్స్ విషయానికొద్దాం. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేశాడు పవన్ కల్యాణ్. కాస్త కత్తియుద్ధం, కర్రసాము ప్రాక్టీస్ చేసి మరీ సెట్స్ పైకి వచ్చాడు. మే, జూన్ నెలల్లో కాల్షీట్లన్నీ ఈ సినిమాకే కేటాయించాడు. దీంతో ఆగస్ట్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు దర్శకుడు క్రిష్.
కానీ పవన్ తో అన్నీ అనుకున్నట్టు నడవవు. ఆయన ఎప్పుడు రాజకీయ యాత్రలు పెట్టుకుంటారో, ఎప్పుడు సెట్స్ పైకి వస్తారో, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారో ఎవ్వరూ చెప్పలేరు. వీటికితోడు మధ్యలో మరో మూవీ మొదలుపెడితే మొత్తానికి మోసం. అందుకే రిలీజ్ డేట్ పై అంత సందిగ్దత.
క్రిష్ అనుకున్నట్టు ఆగస్ట్ కు సినిమా పూర్తయితే, వీరమల్లు సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. అప్పుడు మళ్లీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పట్నుంచే కొన్ని సినిమాలు సంక్రాంతిపై కన్నేశాయి. ఈ సంగతి పక్కనపెడితే.. సంక్రాంతి వరకు సినిమాను ఆపితే, నిర్మాతకు వడ్డీలు తడిసిమోపెడవుతాయి. ఇప్పటికే ఏఎం రత్నం ఆర్థిక కష్టాల్లో ఉన్నారట. ప్రస్తుతానికైతే దర్శకనిర్మాతలు షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు. పవన్ తో పని పూర్తిచేస్తే అదే పదివేలు అనుకుంటున్నారు.