విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, గర్వం. అలాంటి ప్లాంట్ ని అమ్మేస్తామని గత ఏడాదిగా కేంద్రం దూకుడు చేస్తోంది. దాని మీద ఉక్కు కార్మికులు మొదటి రోజు నుంచే ఉద్యమాలు చేస్తూ వచ్చారు. అలాగే సమ్మెలు, బందులు అన్నీ కూడా జరిగాయి. గల్లీ టూ ఢిల్లీ దాకా మార్చ్ చేశారు.
అయినా కేంద్రం ఎక్కడా తగ్గకపోగా మేము ప్రైవేట్ చేసి తీరుతామని చెప్పేసింది. పార్లమెంట్ లో సంబంధిత మంత్రి అయితే నష్టాల్లో ప్లాంట్ ఉందని అనేశారు. అయితే లేటెస్ట్ గా స్టీల్ ప్లాంట్ ఆర్ధిక నివేదికలు చూస్తే ఏకంగా 800 కోట్ల పై చిలుకు లాభాలను ఆర్జించాయి.
ఇవన్నీ ఇలా ఉంటే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఎన్నికలు రెండేళ్ళుగా వాయిదా పడుతూ తాజాగా జరిగాయి. ఈ ఎన్నికలు కంప్లీట్ గా స్టీల్ ప్లాంట్ కి ప్రైవేట్ పరం చేయవద్దు అన్న దాని మీదనే జరిగాయి. అయితే ప్రధానంగా మూడు పెద్ద కార్మిక సంఘాలు పోటీ పడితే ఏఐటీయూసీనే కార్మికులు ఈసారి ఎన్నుకున్నారు.
ఐఎన్టీయూసీ మీద ఏకంగా 466 ఓట్ల తేడాతో ఏఐటీయూసీ గెలిచింది. ఇది ప్రైవేట్ మీద కార్మికుల ఆగ్రహం. యాంటీగా వారు వేసిన ఓటు అంటున్నారు. సరే ఇప్పటిదాకా గుర్తింపు యూనియన్ గా ఉన్న సీఐటీయూ తన వంతుగా పోరాటం చేసింది. అలాగే బలంగా ఐఎన్టీయూసీ కూడా ఉంది. ఇపుడు ఎటూ ఎన్నికలు అయిపోయాయి. కార్మికుల మనోగతం వెల్లడైంది.
మరి ఒక్క ఏఐటీయూసీ మాత్రమే ప్రైవేట్ కు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు కదా. దానికి మిగిలిన యూనియన్లూ సహకరించాలి. కార్మిక ఎన్నికల్లో చీలిపోయిన ఈ సంఘాలు మళ్లీ ఒక్కటిగా నిలిచి నినదిస్తేనే ఏమైనా ప్రయోజనం ఉంతుంది. ఆ దిశగా అందరూ అడుగులు ముందుకు వేస్తారా. చూడాలి.