ఈ మధ్యనే రిషబ్ పంత్ ను టీమిండియాకు కెప్టెన్ ను చేయాలని ఎవరో డిమాండ్ చేశారు. దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న పంత్ చిరస్మరణీయ విజయాల్లో తనవంతు పాత్రను అద్భుతంగా పోషించిన నేపథ్యంలో… పంత్ ను కెప్టెన్ గా చేసేస్తే భవిష్యత్తుకు మంచిదని కొందరు మాజీ ఆటగాళ్లు సూచించారు.
అయితే పంత్ బ్యాటింగ్ లోనే అనుభవరాహిత్యం, అతి దూకుడు కొంత వరకూ సామాన్య ప్రేక్షకులకూ అర్థం అవుతూ ఉంటుంది. అలాంటిది అతడికి కెప్టెన్సీ ఏమిటనే ప్రశ్నలూ పడ్డాయి అప్పట్లోనే!
అయితే ఐపీఎల్ లో మాత్రం పంత్ కు తిరుగులేదు. ఢిల్లీ జట్టుకు పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తనదైన అతి దూకుడు చూపించి పంత్ ఇప్పుడు భారీ జరిమానాను ఎదుర్కొంటున్నాడు. ఏకంగా మైదానం నుంచి తమ బ్యాటర్లను వెనక్కు పిలిపించే ప్రయత్నం చేసి పంత్ వార్తల్లో నిలిచాడు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. అతడికి భారీ జరిమానాను విధించింది!
పంత్ కు ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్ కు కోటి రూపాయలకు పైగా అందుతుంది. ఇలాంటి నేపథ్యంలో అతడి మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా విధించింది గవర్నింగ్ కౌన్సిల్. దీంతో కోటి రూపాయలకు పైగా అతడికి కొరతపడనుంది!
పంత్ చూపిన అతి దూకుడుకు చెల్లించుకుంటున్న మూల్యం ఇది. పంత్ పైనే గాక.. ఈ వ్యవహారంలో ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్ పై జరిమానానే గాక ఒక మ్యాచ్ సస్పెన్షన్ ను కూడా వేశారు. మరో ఆటగాడు శార్దూల్ ఠాకూర్ కు యాభై శాతం జరిమానా పడింది.
ఐపీఎల్ మాయలోనో.. అతి దూకుడుతోనో.. ఏకంగా బ్యాటర్లను వెనక్కు పిలవడం వంటి తీవ్రమైన చర్యలకు ఇది తగిన జరిమానానే. దశాబ్దాల కిందటే ఇలాంటి పనే చేయబోయి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇప్పటికీ తన చర్యపై వివరణ ఇచ్చుకుంటూ ఉంటారు.
తను ఆ రోజు బ్యాటర్లను వెనక్కు పిలవలేదని.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇష్టానుసారం మాట్లాడుతూ, తమను బయటకు వెళ్లిపొమ్మన్నారంటూ గవాస్కర్ ఇటీవల కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో తన ప్రవర్తనను గవాస్కర్ స్వయంగా తప్పు పట్టుకున్నారు కూడా!