ఇది ఓటీటీ మేటర్. ఆల్రెడీ వెంకటేష్ ఓటీటీలోకి వచ్చేశారు. రానానాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. దానిపై దారుణంగా ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ హీరో వెంకీని పాడుచేశారంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. అయితే వెంకీ-రానా అండ్ కో మాత్రం ఈ విమర్శల్ని సమర్థంగా తిప్పికొడుతోంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చింది. అవును, అన్నీ అనుకున్నట్టు జరిగితే, బాలయ్య కూడా ఓ వెబ్ సిరీస్ లో, మెరిసే అవకాశం ఉంది. ఈ దిశగా డిస్నీ హాట్ స్టార్ సంస్థ పావులు కదుపుతోంది. బాలయ్య ఒప్పుకుంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
నిజానికి బాలయ్యకు ఓటీటీ కొత్త కాదు. వెంకీ నేరుగా ఓ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి వెళ్లాడు కానీ, బాలయ్య ఆల్రెడీ ఓటీటీలో పెద్ద స్టార్. అతడు నిర్వహించిన అన్-స్టాపబుల్ సీజన్-1 పెద్ద హిట్టయింది. సీజన్-1 అంత కాకపోయినా, సీజన్-2 కూడా బాగానే క్లిక్ అయింది.
వీటితో పాటు ఆహా యాప్ లో కీలకమైన కొన్ని కార్యక్రమాల్లో కూడా బాలయ్య కనువిందు చేస్తున్నాడు. కాబట్టి ఓటీటీ స్పేస్ బాలయ్యకు కొత్త కాదు, ఎటొచ్చి వెబ్ సిరీస్ అనేది మాత్రం ఈయనకు కొత్త. ఈ యాంగిల్ లోనే డిస్ని జనాలు బాలయ్యను ఒప్పించాల్సి ఉంటుంది.
చేస్తున్నది సినిమానా, వెబ్ సిరీసా అనేది బాలయ్య పెద్దగా ఆలోచించరు. కంటెంట్ కు కనెక్ట్ అయితే కళ్లుమూసుకొని చేసేసే టైపు. కాబట్టి వెబ్ సిరీస్ లో బాలయ్య నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనం.