సాక్షాత్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ నే అటూ ఇటూ కాకుండా చేశారు. టీవీల్లో సచిన్ సినిమా అప్పుడప్పడు వేస్తూ ఉంటారు. అది డాక్యుమెంటరీకి ఎక్కువ ఫీచర్ ఫిల్మ్ కు తక్కువ అన్నట్టుగా ఉంటుంది. దానికి అటూ ఇటుగా ధోనీ బయోపిక్ వచ్చింది, సంచలన విజయం సాధించింది. అయితే ఎన్నో ఎమోషన్స్ ఉన్న అజర్ బయోపిక్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.
ఇక ఇప్పుడు 83 దాదాపు రెడీ అయ్యింది. 1983లో కపిల్ సేన సాధించిన క్రికెట్ వరల్డ్ కప్ చుట్టూ ఈ కథాంశాన్ని అల్లుకున్నారు. ఇందులో కపిల్ పాత్రలో రణ్ వీర్ సింగ్ పోజే సినిమా పై ఆసక్తిని పెంచింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సినిమా వెనుకకు వెళ్లిపోయింది.
ఇక ఇప్పుడు తన బయోపిక్ ను అనౌన్స్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ. ఇప్పటికే సంప్రదింపులు జరిగిన విషయాన్ని గంగూలీనే ధ్రువీకరించాడు. మిగిలిన వివరాలను త్వరలోనే చెబుతాడట దాదా.
ప్రస్తుతం గంగూలీ టైమ్ నడుస్తోంది. సర్వత్రా గంగూలీ జపం జరుగుతోంది. తాజాలు, మాజీలు అంతా గంగూలీ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. గంగూలీ నిస్సందేహంగా గొప్ప క్రికెటరే కానీ, బీసీసీఐ బాస్ కావడంతోనే ఇప్పుడు చాలా మంది ఆయన భజన చేస్తున్నారేమో అనిపించకమానదు. ఆ పరంపరలో ఇప్పుడు సినిమా కూడా వచ్చేస్తోంది.
అయినా గంగూలీ క్రికెట్ కెరీర్ లో బీభత్సమైన ఎమోషన్ ఉండదు. ప్రత్యేకించి ఆయన ఎదుగుదల వేరే. ధోనీ తరహా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు దాదా. పుట్టుకతోనే ఒక ధనవంతుల కుటుంబం. ఎక్స్ ట్రా ప్లేయర్ గా ఉన్న రోజుల్లో మైదానంలోని ఆటగాళ్లకు కూల్ డ్రింక్స్ తీసుకెళ్లడానికి నిరాకరించిన మహారాజా గంగూలీ. దూకుడైన ఆట తీరే.
మొదట్లో వివాదాల జోలికి వెళ్లలేదు కానీ, కెప్టెన్ అయ్యాకా మాత్రం తీరు మారింది. ధీటైన కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఆ పాత్రలో చివరి వరకూ సాగలేకపోయాడు. కెప్టెన్సీ పోయింది, ఆటగాడిగా స్థానమూ కోల్పోయాడు. గంగూలీని మరిచిపోయారంతా! అయితే ఆ తర్వాత తిరిగి జట్టులో స్థానం సంపాదించుకుని, ఆటగాడిగా గౌరవప్రదమైన రిటైర్మెంట్.
గొప్ప ఇన్నింగ్స్ లున్నాయి, కెప్టెన్ గా ప్రత్యేక ముద్ర వేశాడు. ఫిక్సింగ్ గోల మధ్యన గంగూలీ కెప్టెన్సీ తీసుకోవడమే చెప్పుకోదగిన ఘట్టం. మరి ఇవి మాత్రమే ఒక సినిమాకు సరిపోతాయా? నగ్మాతో ఎఫైర్ వంటివి కూడా అదనపు మసాలాలను అద్దుతాయా! అయినా… ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా సాగిన స్పోర్ట్ పర్సన్ బయోపిక్స్ అంత ఆకట్టుకోవు. మరి గంగూలీ బయోపిక్ లో ఎలాంటి ఎమోషన్స్ ను అద్దుతారో!