Advertisement

Advertisement


Home > Movies - Movie News

దృశ్యం-2 అరుదైన సీక్వెల్ గా నిలుస్తోంది!

దృశ్యం-2 అరుదైన సీక్వెల్ గా నిలుస్తోంది!

ఒక సూప‌ర్ హిట్ సినిమాను మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం కొత్త కాదు. అలాగే ఏదైనా సూప‌ర్ హిట్ సినిమాకు కొన‌సాగింపుగా సీక్వెల్ వ‌స్తే.. స‌ద‌రు సీక్వెల్ ను కూడా కొన‌సాగింపుగా రీమేక్ చేయ‌డం కూడా ఇది వ‌ర‌కూ కొన్ని సార్లు జ‌రిగింది. అయితే .. ఎన్ని భాష‌ల్లో రీమేక్ అయితే, అన్ని భాష‌ల్లోనూ సీక్వెల్ కూడా రీమేక్ కావ‌డం అనేది దృశ్యం-2 కు ప్ర‌త్యేకం కాబోతోంది. 

క‌రోనా లాక్ డౌన్ల కాలంలోనే దృశ్యం-2 మ‌ల‌యాళీ వెర్ష‌న్ ఆస‌క్తిని రేకెత్తించింది. అప్ప‌టికే సూప‌ర్ హిట్ అయ్యి, వేరే భాష‌ల్లో రీమేక్ కూడా అయిన దృశ్యం సినిమాకు కొన‌సాగింపు దృశ్యం-2. మిస్ట‌రీగా మిగిలిన దృశ్యం సినిమా క్లైమాక్స్ కు బ్యాక్ గ్రౌండ్ లోనే కొంత కొత్త క‌థ‌నాన్ని యాడ్ చేసి మ‌ల‌యాళీలు దృశ్యం-2తో హిట్ కొట్టారు. ఆ వెంట‌నే దృశ్యం సినిమాను రీమేక్ చేసిన వాళ్లంతా మ‌ళ్లీ అటు వైపు చూశారు.

దృశ్యం-2 తెలుగులో య‌థాత‌థంగా రీమేక్ అయ్యింది. మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడే తెలుగులో కూడా ఈ సారి రూపొందించాడు. అలాగే దృశ్యం సినిమాను క‌న్న‌డ‌లో రీమేక్ చేసిన పి.వాసు దృశ్యం-2 ను కూడా అక్క‌డ రీమేక్ చేశాడు. 

ఇక హిందీ వాళ్లు కూడా ట్రైల‌ర్ వ‌ర‌కూ వ‌చ్చేశారు. దృశ్యం-2 హిందీ రీమేక్ వ‌చ్చే నెల‌లో విడుద‌ల కాబోతోంది. ఇలా సీక్వెల్ పార్ట్.. మూడో భాష‌లో కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇక త‌మిళం మాత్ర‌మే పెండింగ్.

దృశ్యం సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రీమేక్ అయ్యింది. ఇక దృశ్యం-2 తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇప్పుడు హిందీలో విడుద‌ల‌వుతోంది. మ‌రి క‌మ‌ల్ హాస‌న్ కూడా ఒక చూపు చూస్తే.. ఈ సినిమా త‌మిళ రీమేక్ కూడా జ‌ర‌గొచ్చు.

మ‌రోవైపు మ‌ల‌యాళీలు దృశ్యం 3 రూప‌క‌ల్ప‌న‌లో బిజీగా ఉన్నారు. కొన్ని నెల‌ల కింద‌ట దృశ్యం 3 ప్రాజెక్టును అనౌన్స్ చేశారు అక్క‌డి రూప‌క‌ర్త‌లు. య‌థాత‌థంగా దృశ్యం న‌టీన‌టుల‌తోనే మూడో పార్టు రెడీ కాబోతోంది. మ‌రి అది హిట్ అయితే.. తెలుగు,  హిందీ, క‌న్న‌డ‌ల్లో మూడో దృశ్యాన్ని కూడా చూడ‌వ‌చ్చేమో!

ఇది వ‌ర‌కూ హిందీ లో ప‌లు సీక్వెల్ ల‌కు రీమేక్ లు వ‌చ్చాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్ హిట్ అయ్యాకా, తెలుగులో అది రీమేక్ అయ్యింది. ఆ త‌ర్వాత ల‌గేర‌హో మున్నాభాయ్ హిందీలో హిట్ అయ్యింది. దాన్ని కూడా తెలుగులో రీమేక్ చేశారు. అయితే అది డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో హిందీ సీక్వెల్ పార్ట్ రీమేక్ ప్ర‌య‌త్నాలు కూడా జ‌ర‌గ‌లేదు. అలాగే ద‌బంగ్ సినిమా సీక్వెల్ ల‌ను కూడా వేరే భాష‌ల వాళ్లు ట‌చ్ చేయ‌లేదు. దృశ్యం మాత్రం వాట‌న్నింటి క‌న్నా ప్ర‌త్యేకంగా నిలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?