బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ హత్య కేసులో డ్రగ్స్ కోణం ఉందనే వాదనలకు నిజం చేకూరేలా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ రాకెట్ లో కీలక నిందితులు ఇద్దర్ని అరెస్ట్ చేయగా.. అందులో ఒకడు రియా సోదరుడు షోవిక్ పేరు బయటపెట్టాడు. అంతేకాదు, అతడ్ని గుర్తుపట్టాడు కూడా. దీంతో సుశాంత్ మరణానికి సంబంధించిన కేసు పూర్తిస్థాయిలో “డ్రగ్స్ మలుపు” తీసుకున్నట్టయింది.
నిన్న సాయంత్రం ముంబయిలో ఇద్దరు డ్రగ్ సరఫరాదారుల్ని అదుపులోకి తీసుకుంది మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్సీబీ). వీళ్ల వద్ద నుంచి మూడున్నర కిలోల మరిజానా అనే డ్రగ్ ను స్వాధీనం చేసుకుంది. ముంబయిలో జరగబోయే పేజ్-3 పార్టీల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ఇద్దరూ అంగీకరించారు. ముంబయి మార్కెట్లో దీని ధర గ్రాము 5వేల రూపాయలు.
దీంతో పాటు గోవా హోటల్స్ బిజినెస్ వ్యాపారి గౌరవ్ ఆర్యాను ఎన్సీబీ వరుసగా రెండోరోజు ప్రశ్నించింది. తాజాగా పట్టుబడిన డ్రగ్స్ కు, అతడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారిస్తోంది.
అటు సుశాంత్ మరణంపై రంగంలోకి దిగిన సీబీఐ, వరుసగా నాలుగో రోజు రియాను విచారించింది. బాలీవుడ్ మీడియా చెబుతున్న ప్రకారం చూసుకుంటే.. సుశాంత్ ను మర్డర్ చేసినట్టు సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో సుశాంత్ ఆత్మహత్యకు కారణాల్ని వెదికే పనిలోనే సంస్థ పడినట్టు కొన్ని బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి.
మరోవైపు తాజా విచారణలో రియా మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. మానసిక సమస్య (బై-పోలాల్ డిజార్డర్)తో బాధపడుతున్న సుశాంత్.. ఈమధ్య తను తీసుకుంటున్న మెడిసన్ ను మార్చాడని, అయితే అతడు మందులు మార్చే సమయానికి తను ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లినట్టు రియా తెలిపింది. సుశాంత్ వైద్యులతో పాటు, సుశాంత్ ఇంట్లో పనిమనుషులు, సుశాంత్ సోదరి, రియా కూడా ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటపెట్టకపోవడం గమనార్హం.