ఏ రాజకీయ ఎజెండా లేకపోతే ఈనాడు అధినేత రామోజీరావు అంత నిఖార్సైన జర్నలిస్టు మరెవరూ లేరని చెప్పొచ్చు. తన వ్యక్తిగత, సామాజిక వర్గ ప్రయోజనాల ఊబిలో ఇరుక్కుని….రామోజీ భ్రష్టపట్టారనే విమర్శ ఉంది గానీ, నిజానికి ఆయన మెరుగైన సమాజ కాంక్షతో బయల్దేరిన వ్యక్తే. మరోసారి ఆయనలోని సామాజిక కోణం వెలుగు చూసింది.
జర్నలిస్టుకు ప్రధానంగా ధైర్యం, సాహసం, తెగువ ఉండాలి. రామోజీలోని ఆ మూడు లక్షణాలు అకస్మాత్తుగా మేల్కొన్నాయి. అందుకు నిదర్శనమే నేటి ఈనాడు సంపాదకీయం.
‘ప్రాథమిక హక్కుకు దిక్కెవరు?’ శీర్షికతో ఈనాడు సంపాదకీయం రాసింది. ఇటీవల సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రముఖ న్యాయకోవిదుడు ప్రశాంత్‌భూషణ్‌కు కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టు శిక్ష విధించడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ప్రదర్శించిన దూకుడుపై సామాన్యులు మొదలుకుని న్యాయకోవిదుల వరకు తీవ్ర విమర్శలు గుప్పించారు. కోర్టు ధిక్కరణ కేసులో విచారణలో భాగంగా ఒక దశలో న్యాయస్థానం అందరూ కోర్టునే తప్పు పడుతున్నారని, అతనికి (ప్రశాంత్ భూషణ్)కు మద్దతుగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిందే. కోర్టు ధిక్కరణ కింద ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడం మరింత ఆశ్చర్యపరిచింది.
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కింద ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష విధించడాన్ని రామోజీరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా….ఆయన పత్రికలో రాసిన సంపాదకీయాన్ని చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానమే…వాటిని హరిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలనే ధర్మ సందేహాన్ని రామోజీ వ్యక్తం చేశారు.
‘దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ భావ ప్రకటన స్వేచ్ఛకు గొడుగుపట్టాలి. దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని, చర్యల్ని తోసిపుచ్చడం వాటి ప్రాథమిక విధి’- అంటూ 36 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రాజ్యాంగ స్ఫూర్తి పరిమ ళిస్తోంది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చెయ్యడాన్నే మహాపరాధంగా పరిగణించి కోర్టు ధిక్కరణ నేరం కింద సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌కు శిక్ష విధించిన సుప్రీంకోర్టు- స్వయం ప్రవచిత ఆదర్శానికే చెల్లు కొట్టింది’ అంటూ రామోజీరావు తన సంపాదకీయం ద్వారా దేశ అత్యున్నత న్యాయ స్థానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష విధించిన సుప్రీంకోర్టు…స్వయం ప్రవచిత ఆదర్శానికే చెల్లు కొట్టిందని చెప్పడానికి ఎంతో తెగువ, సాహసం ఉండాలి. చాలా ఏళ్ల తర్వాత ఈనాడులో వాటిని చూడడం ఒకింత ఆశ్చర్యంగా, ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే పత్రికలు నిజంగా తమ పని తాము చేయడం మానేసి చాలా కాలమైంది. రాజకీయ ఎజెండాలతో మీడియా వ్యవస్థల్ని నడపడం వల్ల సమాజ ఆకాంక్షలు, ఆలోచనలను స్థానం లేకుండా పోయింది.
కానీ ఈనాడులో నేటి సంపాదకీయం మాత్రం న్యాయ వ్యవస్థపై సమాజ ఆలోచనలను ప్రతిబింబిస్తుండడం వల్లే …దానికి గౌరవం దక్కిందనే చెప్పాలి. ‘విమర్శనాత్మక ట్వీట్లకే కదలబారిపోయేటంత బలహీనమైనదా న్యాయపాలిక ప్రతిష్ఠ? అన్నదే ఆలోచనా పరుల్ని కలచివేస్తున్న సందేహం’ అంటూ అసలు కోర్టు ధిక్కరణ అంశాన్నే ప్రశ్నించింది.
‘విమర్శల పీక నులమడం ద్వారా కోర్టులపై విశ్వాసాన్ని కలిగించలేము’ అని ఏనాడో 1952నాటి కేసులో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరించింది. 1978నాటి కేసులో జస్టిస్ కృష్ణయ్యర్- ఏనుగులు పోతుంటే కుక్కలు మొరిగినట్లుగా ఆ విమర్శల్ని తాము పట్టించుకోవడం లేదంటూ చీటికి మాటికి ఇలాంటి చీకాకులకు న్యాయపాలిక స్పందించబోదని తీర్పు ఇచ్చారు. ముల్గావోంకర్ సూత్రాలుగా ప్రతీతమైన ఆ మహితోక్తులే న్యాయపాలికకు దారిదీపం కావాలిప్పుడు!’…అక్షరం అక్షరం అన్యాయాన్ని ధిక్కరిస్తూ, ప్రశ్నిస్తూ సంపాదకీయం సాగడాన్ని మనం చూడొచ్చు.
విమర్శల పీక నులమడం ద్వారా కోర్టులపై విశ్వాసాన్ని కలిగించలేము అని 1952 నాటి కేసులో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరించిన దాన్ని…ఇప్పుడు గుర్తు చేయడం అంటే, నేడు నడుస్తున్న తీరు బాగా లేదని ఎత్తి చూప డమే. అంతేకాదు, న్యాయస్థానాలకు దారి దీపం ముల్గావోంకర్ చెప్పిన న్యాయసూత్రాలే అని పేర్కొనడం ద్వారా వర్తమాన పరిణామాలపై అసంతృప్తి, నిరసన వ్యక్తం చేసినట్టైంది.
‘కోర్టు ధిక్కారం పేరిట కొరడా ఝళిపించి సహేతుక విమర్శల నోరు నొక్కేయకూడదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రకటిం చిన జస్టిస్ఏఎస్ ఆనంద్- సార్వజనిక సంస్థల(పబ్లిక్ఆఫీస్) బాధ్యతలు నిర్వర్తించే వారెవరైనా ప్రజలకే జవాబుదారీ కావాలని సూచించారు’…ఈ వాక్యాలు చదువుతుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా! ఎందుకంటే స్వయంప్రతిపత్తిగల రాజ్యాంగ వ్యవస్థలనే పేరుతో తమకు తామే సుప్రీం అనుకుంటూ…తాము ఏది అనుకుంటే అదే ఫైనల్ అన్నట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టడాన్ని ఈ వాక్యాల్లో చూడొచ్చు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ప్రజలకే జవాబుదారీ కావాలనే హితవు చెప్పడం ద్వారా అందరికీ మొట్టికాయలు వేసే వ్యవస్థకే రామోజీ అదే పని చేయడాన్ని చూడొచ్చు.
వాక్ స్వాతంత్య్రానికి అవరోధంగా ఉందంటూ ధిక్కరణ చట్టాన్ని బ్రిటన్ 2013లో రద్దు చేసిందని సంపాదకీయంలో గుర్తు చేయడం అంటే…మనదేశంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడడమేనా? లేదంటే మన దేశంలో కూడా కోర్టు ధిక్కరణ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరిగే పరిస్థితులు ఉత్నన్నమయ్యాయని అర్థం చేసుకోవాలా?
సంపాదకీయంలో ముగింపు ఏమిచ్చారో తెలుసుకుందాం. ‘2016లో బ్రెగ్జిట్‌పై తీర్పు ఇచ్చిన ముగ్గురు జడ్జీల్ని ‘ప్రజలకు శత్రువులు’గా డెయిలీ మెయిల్ విమర్శించినా- దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించకపోవడంలోనే న్యాయపాలిక పరిణతి గుబాళించింది. న్యాయపాలనకు ముప్పు ఏర్పడినప్పుడే కొరడా ఝళిపించగలిగే ఆ తరహా పరిణతి కోర్టుల గౌరవాన్ని పెంచుతుంది!’…అంటే ప్రస్తుతం మన దేశ న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రామోజీరావును ఎంతగా కలత చెందిస్తున్నాయో….ఈ సంపాదకీయం ప్రతిబింబిస్తోంది.
సంపాదకీయం అంటే పత్రిక పాలసీకి సంబంధించిన అభిప్రాయం. కాబట్టి దేశ అత్యున్నత న్యాయ స్థాన తీర్పుపై రాసిన ఈ సంపాదకీయం రామోజీ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అచ్చుకు నోచుకోదు. బ్రెగ్జిట్‌పై ముగ్గురు జడ్జిల తీర్పును ప్రజలకు శత్రువులుగా విమర్శించినా కోర్టు ధిక్కరణగా పరిగణించకపోవడంలోనే న్యాయస్థానాల పరిణతి గుబాళించిందని చెప్పడం ద్వారా…తాజాగా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ విషయంలో వ్యవహరించిన తీరును తప్పు పట్టినట్టైంది. ఏది ఏమైనా చాలా ఏళ్ల తర్వాత ఈనాడు సంపాదకీయంలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం అభినందించదగ్గ విషయం.