సాంగ్ అయితే సూపర్ హిట్టయింది. యూట్యూబ్ లో ఇప్పటికీ నంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే అదే సమయంలో 'దమ్ మసాలా' సాంగ్ డౌన్ ట్రెండింగ్ కూడా మొదలైంది. రోజురోజుకు పెరగాల్సిన లైక్స్ తగ్గుతున్నాయి, వ్యూస్ పలచనయ్యాయి.
త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. వీళ్ల కాంబోలో వచ్చిన సాంగ్స్ రికార్డులు సృష్టిస్తాయనే నమ్మకం ఉంది. అల వైకుంఠపురములో సినిమాతో ఈ కాంబోకు క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా నుంచి బుట్టబొమ్మ, సామజవరగమన సాంగ్స్ పెద్ద హిట్టయ్యాయి.
ఆ రికార్డులింకా కళ్లముందు కదలాడుతున్న టైమ్ లోనే గుంటూరు కారం సాంగ్స్ రెడీ అయ్యాయి. ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే పాత రికార్డులు బద్దలవుతాయని అంతా ఊహిస్తారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే, రికార్డులు బద్దలయ్యేలా కనిపించడం లేదు.
దమ్ మసాలా సాంగ్ కు మొదటి రోజు అమాంతం 17 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ సినిమాపై, ఆ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ అలాంటిది. రెండో రోజుకు ఆ వ్యూస్ 5.15 మిలియన్లకు పడిపోయాయి. ఇక మూడో రోజు మిలియన్ వ్యూస్ కూడా రాకపోవడం గమనార్హం.
అటు లైక్స్ లో కూడా అదే డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. రిలీజైన వెంటనే 24 గంటల్లో 2 లక్షల 82 వేలకు పైగా లైక్స్ అందుకున్న ఈ పాటకు, మూడో రోజు కేవలం 14వేల లైక్స్ మాత్రమే వచ్చాయి.
గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన దమ్ మాసాలా సాంగ్ బ్యాడ్ సాంగ్ కాదు. తమన్-త్రివిక్రమ్ కాంబోకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సాంగ్ ఉంది. పైగా పాట సూపర్ హిట్టయింది కూడా. కాకపోతే ఈ సినిమా పాత రికార్డుల్ని బద్దలుకొడుతుందా లేదా అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్. మరీ ముఖ్యంగా అల వైకుంఠపురములో సాంగ్స్ ను ఇది మరిపిస్తుందా అనేది చర్చనీయాంశం. ఆ పాట రేంజ్ కు దమ్ మసాలా చేరుకోవడం కష్టం అంటున్నారు చాలామంది. గుంటూరు కారం నుంచి నెక్ట్స్ వచ్చే మెలొడీ సాంగ్ ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి.