డాడీ టాప్ ప్రొడ్యూసర్. అన్న టాప్ హీరో..కానీ అల్లు శిరీష్ కు మాత్రం సరైన సినిమా పడడం లేదు. మార్కెటింగ్ లెక్కలు అన్నీ చూసుకుని తప్ప, శిరీష్ కు ఓ మాంచి క్రేజీ ప్రాజెక్టు ఇవ్వాలని తండ్రి అల్లు అరవింద్ అనుకుంటున్నట్లు లేదు. ఆయన తలచుకుంటే పెద్ద డైరక్టర్ ను తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు.
రెండు భయంకరమైన ఫ్లాపులు ఇచ్చిన డైరక్టర్ రాకేష్ శశి చేతిలో సినిమా పెట్టడం అంటే బహుశా రీమేక్ అనే ధైర్యం అయి వుండాలి. నిజానికి అల్లు శిరీష్ కు బ్రేక్ ఇవ్వడం కన్నా, ఈ సినిమాతో రాకేష్ కు సక్సెస్ రావాల్సి వుంది.
అదృష్టం ఏమిటంటే తమిళంలో హిట్ అయిన ప్యార్..ప్రేమ..కాదల్ సినిమా శిరీష్ కు 'ప్రేమ కాదంట' కు మాతృక కావడం. యూత్ ఫుల్ సినిమానే అది. అన్ని పనులు అయిపోయాక, ప్రేమ కాదు టైమ్ పాస్ అనే హీరోయిన్ చుట్టూ తిరిగే కథ ఇది.
ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడు మాత్రమే. నిర్మాత విజయ్. సినిమా హక్కులు ఆయన దగ్గరే వున్నాయి కనుక ఆయనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు కూడా నిర్మాత మధుర శ్రీధర్ ఓ మలయాళ హిట్ సినిమా తెచ్చి అల్లు శిరీష్ తో ఒక విఫల ప్రయత్నం చేసారు.