‘‘జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం అవ్వలేడు. ఇది శాసనం’’ – పవన్ కళ్యాణ్.
‘‘మేక్ మై విష్ సంస్థ వాళ్లే జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కోరిక తీర్చాలి. ఇక ఎప్పటికీ తీరని కోరికలు కాసేపైనా తీర్చడానికి ఆ సంస్థ ఉంది’’– సీ. ఎం. రమేష్
‘‘నువ్వెప్పుడు ముఖ్యమంత్రి అవుతావు నయనా? కలలు కను. నిన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా చెబుతున్న. నువ్వెప్పటికీ ముఖ్యమంత్రివి కాలేవు’’– జేసి. దివాకర రెడ్డి.
రెండేళ్ల క్రితం కంటే కాస్త ముందు వేరు వేరు నాయకులు అన్న మాటలివి.
కట్ చేస్తే గూబ గుయ్యిమనేంత మెజారిటీతో యావత్ శత్రువర్గం నోరెళ్ళబెట్టేంత ఘన విజయాన్ని నమోదు చేసుకుంది వై.ఎస్.ఆర్.సీ.పి. జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో ఎంతెలా మమేకం అయ్యాడో నిజానికి సొంత పార్టీవాళ్లే సరిగ్గా అంచనా వెయ్యలేకపోయారు. వై.ఎస్.ఆర్.సీ.పి దిగ్గజాలే 120 సీట్లు వస్తాయని చెప్పుకుంటే ప్రజలు 151 ఇచ్చారు. ఊహించని విజయం అంటే అదే.
సరిగ్గా మే 30, 2019 న ‘‘వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనే నేను….’’ అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలుపెడితే బాహుబలి సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా జయజయధ్వానాలు ఆకాశాన్నంటాయి.
అవును ఆ సన్నివేశానికి సరిగా రెండేళ్లు నిండాయి.
ఎంత గొప్ప రాజకీయ విజయమైనా ప్రజావ్యతిరేకత చాలా తొందరగా వస్తుంది. అనుకున్న వాగ్దానాలు అనుకున్న విధంగా నెరవేర్చ లేకపోవడమే ప్రధాన కారణం. ‘‘ఏవో వాగ్దానాలు చేసాం..చచ్చీ చెడి ప్రచారం చేసి జనాన్ని నమ్మిస్తే పదవొచ్చింది..జనానికి చెప్పినవన్నీ చెయ్యాలంటే కష్టం…ఏది ఏమైనా ఐదేళ్ల వరకు ఢోకా లేదు..మళ్లీ ఎన్నికలకి ఏదో మాయ చేసి, తాయిలాలిచ్చి కుర్చీ ఎక్కొచ్చులే..’’ అనుకునే నాయకులే ఎక్కువగా ఉంటారు.
కానీ జగన్ మోహన్ రెడ్డి అలా కాదు. తాను చేయదగ్గ పనులనే మ్యానిఫెస్టోలో చేర్చారు. మ్యానిఫెస్టోలో ఉన్నవాటినే వాగ్దానం చేశాడు. పదవి రాగానే ఇవన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమలు పరిచాడు.
జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్నాలిస్తుంటే, ఆ ప్రజలు కతజ్ఞతతో అతని సింహాసనాన్ని నవరత్నఖచితం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీనెక్కిన తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత జరిగిన మున్సిపల్, కార్పొరేషన్, మరియు తిరుపతి లోక్ సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు సాక్ష్యం.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలే శాసనాలు. అంతే తప్ప టీవీ ఛానళ్ల అరుపులో, వార్తాపత్రికల్లో రాతలో కాదు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాల తీరు నానారకాలుగా మారింది. వై.సీ.పి ని ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మనసులోనే తిట్టుకుంటూ (చంద్రబాబైతే ఏకంగా బహిరంగంగానే గుంటూరు ఓటర్లు అమ్ముడుపోయారని తిట్టడం చూసాం), హిందూ దేవాలయాల మీద దాడుల్ని చేయించి వాటిని అధికార పార్టీ ఖాతాలో వేస్తూ, ఎక్కడ అవకాశం ఉన్నా ప్రభుత్వానిది దళిత వ్యతిరేక స్వరమని ప్రోపగాండా చేస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆ.ప్ర లో ముఖ్యమంత్రి యొక్క క్రైస్తవ కోణం ప్రమాదకరంగా మారుతోందని భ్రమింపజేస్తూ, అమరావతి రైతు ఉద్యమంతో ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయొచ్చన్న కుతంత్రాలతో పన్నాగాలు రచిస్తూ, కొత్త పలుకులు పలుకుతూ, చెత్త చర్చలు పెడుతూ…ఒక్కటి కాదు సాయశక్తులా ప్రభుత్వాన్ని పడదోసే యజ్ఞాన్ని చిత్తశుద్ధిలా అనిపించే చెత్తబుధ్ధితో నిర్వహించాయి ప్రతిపక్షాలు.
అయినా అదేంటో…ఆ ఎత్తుగడ లన్నింటినీ చెరుగ్గడల్ని చీల్చినట్లు చీల్చి నమిలేసారు మున్సిపల్, కార్పొరేట్, తిరుపతి ఓటర్లు.
అసలు 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అరగక ఆపసోపాలు పడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి స్థానిక ఎన్నికల ఫలితాలు కనీసం మింగుడు కూడా పడలేదు.
ఇప్పుడు ఏ యజ్ఞం చెయ్యాలి? ఆశ్చర్యంగా ఇప్పుడు దేవాలయాల మీద దాడులు లేవు. దళితుల మీద అన్యాయాలు లేవు. అమరావతి రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదు. అన్నీ సద్దుమణిగి పోయాయి. ఎందువల్ల? ఇవన్నీ సహజమైనవి కావు కనుక…కేవలం ప్రతిపక్ష ప్రేరేపితం కనుక.
ఎన్ని వ్యవస్థలు, ఎన్ని ప్రతిపక్షాలు ఏకమై ఏం చేయాలనుకున్నా ప్రజల్లోంచి వచ్చి, ప్రజాబలంతో బలపడ్డ నాయకుడి కుర్చీని అర సెంటీమీటరు కూడా కదపడం అసాధ్యమని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
అయితే ఇక్కడొక ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రపంచంలో తొందరగా అవిరై పోయే పదార్థం కతజ్ఞత. నిత్యం రాయితీలు, స్కీములు అందుకుంటున్న ప్రజలకి అది అలావాటైపోయి సంతప్తి మాయమై కతజ్ఞత కపడకుండా పోవచ్చు. అటువంటి సమయం వస్తే ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారనేది చూడాలి. అనుకున్న నవరత్నాలన్నిటినీ రెండేళ్లలోనే అమలు చేసేస్తే రానున్న మూడేళ్లల్లో కొత్తగా చెయ్యడానికి ఏమున్నట్టు? చెయ్యాలన్నా ఖజానాకి అంత శక్తి ఉంటుందా? అలా కాకుండా ఏడాదికి రెండు రత్నాల చొప్పున అమలు పరుస్తూ ఉండుంటే ఐదేళ్లు ప్రజల్ని సంతప్తికరంగా ఉంచే అవకాశం మెరుగ్గా ఉండేదేమో.
అదలా ఉంచితే, ప్రజల్లో గతంలో ఎన్నడూ లేన్నత విధంగా ప్రతిపక్ష వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఒకానొక ప్రతిపక్ష పార్టీ పూర్తిగా భూస్థాపితమైతే చూడాలన్నంత కసి కులాలకతీతంగా అధిక శాతం ప్రజల్లో కనిపిస్తుండడం ఒకానొక చారిత్రక విశేషం. ఆ పార్టీ వారసుడు బలహీనంగా ఉండడం, ఆ పార్టీ నాయకుల మాటలు గానీ, వారిని మోసే పత్రికల్లో రాతలు గానీ సానుభూతి కలిగించేలా లేకపోగా చిరాకు తెప్పించడం కూడా కారణాలు కావచ్చు. హొప్రజలు ఏకంగా ఒక పార్టీ నాశనాన్ని కోరుకోవడం నిజంగా ఆశ్చర్యమే.
ఆ కసికి తగ్గట్టుగానే ఉన్నాయి స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా. ఇదొక్కటీ రానున్న మూడేళ్లలో వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వానికి నవరత్నాలకు భిన్నంగా కలిసొచ్చే అంశం.
అయితే ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం మసలుకోవాలి. ప్రభుత్వం పెద్ద పెద్ద తప్పులు చేస్తే తప్ప ప్రతిపక్ష నాశనం ప్రజలకున్న సంకల్పం మారదు. తప్పులు చేయించే కుట్రలు జరుగుతాయి. అవి కుట్రలని ప్రజలు తెలుసుకుంటారు. అవి ప్రమాదకరం కాదు. స్వతహాగా ప్రభుత్వం తమ పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే అంశంలో తప్పులు చెయ్యకపోతే చాలు.
గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి ఒక మాటన్నారు- ‘‘కొట్టారు- కొట్టించుకున్నాం- మాకు టైమొస్తుంది- మేమూ కొడతాం’’.
అవును..ఇప్పుడు టైమొచ్చింది..నిజంగానే కొడుతున్నాడు. ప్రజల మనసుల్ని కొల్లగొడుతున్నాడు.