కథపరంగానే కాదు, సినిమా మొదలయ్యాకా ఏకంగా కాన్సెప్ట్ పరంగా కూడా అనూహ్యమైన మలుపులు తీసుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అయితే ఈ తరహాలో ప్రేక్షకుడిని ఒప్పించడం, మెప్పించడం చాలా కష్టం. చూస్తున్నది ఏ తరహా సినిమానో ప్రేక్షకుడికి క్లారిటీ ఉండాలి. బిరియానీ వడ్డిస్తారని కూర్చుంటే పాయసం పెడితే ఎలా ఉంటుందో… కాన్సెప్ట్ పరంగానే ఈ అనూహ్యమైన మలుపులు కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తాయి.
ఎలాగో మొదలై.. మరెలాగో సాగుతూ, ఇంకోలాగా ముగిసే సినిమాలు కంగాళీ అనిపించుకుంటాయి. అయితే ఒక రొమాంటిక్ డ్రామా తరహాలో మొదలై.. అనూహ్యమైన టర్న్ తీసుకుని ఒక ఎరోటిక్ మిస్టరీ థ్రిల్లర్ గా సాగుతూ కన్వీన్సింగ్ క్లైమాక్స్ తో ముగిసి, వీక్షించిన వారికి కొన్నాళ్ల పాటు గుర్తుండే సినిమా 'ఐస్ వైడ్ షట్'. ప్రత్యేకించి ఈ సినిమాలోని థ్రిల్లింగ్ పార్ట్ ను ఎరోటిక్ గా చిత్రీకరించిన విధానం షాకింగ్ రేంజ్ లో ఉంటుంది.
తమకు తెలిసిన ఒక ధనికుడు విక్టర్ ఇస్తున్న ప్రీ క్రిస్మస్ పార్టీకి భార్యాభర్తలు అలీస్, బిల్ హార్ఫోర్డ్ (నికోల్ కిడ్మన్, టామ్ క్రూస్) లు రెడీ అవుతుండటంతో సినిమా మొదలవుతుంది. ఏడెనిమిదేళ్ల దాంపత్యం వారిది. ఒక కూతురు. బిల్ పేరెన్నిక గల వైద్యుడు. చాలా మంది ప్రముఖులకు పర్సనల్ డాక్టర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. బిల్ కు పేషెంట్ విక్టర్ ఇస్తున్న పార్టీ అది.
చాలా ఖరీదైన మనుషులు ఆ పార్టీకి వచ్చి ఉంటారు. అందగాడు కావడంతో పెళ్లై, పిల్లలున్నవాడైన బిల్ వెంట అమ్మాయిలు పడుతూ ఉంటారు. ఆ పార్టీలో భార్యాభర్తలు చెరోవైపు వెళ్లగా .. ఇద్దరమ్మాయిలు బిల్ ను చూసి మనసుపారేసుకుంటారు. అతడితో మాట్లాడేందుకు ఉత్సాహం చూపుతారు. అయితే తను పెళ్లైన వాడినంటూ తప్పించుకుని వెళ్తాడు బిల్. ఇంతలో పార్టీ హోస్టు విక్టర్ నుంచి బిల్ కు పిలుపొస్తుంది. పార్టీ జరుగుతున్న ఇంట్లోనే విక్టర్ ఒక మగువతో గడుపుతుంటాడు. అమెకు డ్రగ్స్ ఎక్కువ కావడంతో.. అపస్మారక స్థితిలో పడిపోతుంది. బిల్ తో ఆమెకు ప్రాథమిక చికిత్స చేయిస్తాడు విక్టర్. ఆమె కోలుకుంటుంది.
ఒకవైపు బిల్ ఈ పనిలో ఉండగా.. అతడి భార్య మరో వయసు మళ్లిన వ్యక్తితో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అతడు ఆమెతో సంబంధాన్ని కోరుకుంటాడు. తను పెళ్లైన స్త్రీనంటూ, తనకు భర్త ఉన్నాడంటూ అమె అతడి నుంచి తప్పించుకుని వెళ్తుంది. పార్టీలోనే బిల్ కాలేజ్ మేట్ ఒకరు కనిపిస్తాడు. అతడొక పియానిస్ట్. వైద్య విద్యను మధ్యలో వదిలి తనకు ఇష్టమైన పియానిస్ట్ గా మారి ఉంటాడు. పేరు తెచ్చుకుని ఉంటాడు. ఆ విషయాన్ని భార్యకు చెబుతాడు బిల్. లేట్ నైట్ కు ఇంటికి చేరి ఆ భార్యాభర్త గంజాయి పీలుస్తూ ఉంటారు.
పార్టీలో తమకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకుంటూ.. గంజాయి ప్రభావంతో ఇద్దరూ మనసులు విప్పి మాట్లాడుకుంటారు. ప్రత్యేకించి సెక్స్ గురించి. ఆ సమయంలో అలీస్ చెప్పే విషయం బిల్ ను షాక్ గురి చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం తను ఒక నేవీ ఆఫీసర్ ను చూసినట్టుగా, అప్పటి నుంచి అతడు తన మనసులోనే ఉన్నాడంటూ ఆమె చెబుతుంది. అతడితో సెక్స్ అనుభవాన్ని తన మనసు తీవ్రంగా కోరుకుంటూ ఉందని, అతడు ఎక్కడుంటాడో కూడా తనకు తెలియదని ఆమె చెబుతుంది. ఒక్క సారి చూడటంతోనే తన సెక్సువల్ ఫాంటసీల్లో ఆ ఆఫీసర్ అలాగే మిగిలిపోయాడంటూ ఆమె చెబుతుంది. తనతో అనునిత్యం రమించే తన భార్య మరో వ్యక్తిని మనసులో ఉంచుకుని, సెక్సువల్ ఫాంటసీలను కలిగి ఉందనే విషయాన్ని బిల్ తేలికగా జీర్ణించుకోలేడు.
ఆ రాత్రే తన పేషెంట్ మరొకరి ఇంటి నుంచి బిల్ కు కాల్ వస్తుంది. అక్కడకు వెళితే ఆ వృద్ధ పేషెంట్ మరణించి ఉంటాడు. ఆయన కూతురు బిల్ ను ప్రేమిస్తున్నానంటూ చెబుతుంది. తనకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ ఆ డాక్టర్ కు చెబుతుందామె. తండ్రి శవం ఇంట్లో ఉన్నా.. ఆమె ఆ డాక్టర్ కు తొలిసారి ప్రేమ ప్రపోజల్ చేస్తుంది! అయితే బిల్ మనసులో మాత్రం భార్య ఫాంటసీనే వెన్నాడుతుంటుంది.
బిల్ ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ప్రాస్టిట్యూట్ పిలుస్తుంది. ఆమె అతడిని తన ఇంట్లోకి ఆహ్వానించి కొంత డబ్బు ఇస్తే తను సుఖాన్ని ఇస్తానని ఆఫర్ ఇస్తుంది. ఆమెకు డబ్బు ఇచ్చాకా.. తీరా దగ్గరయ్యే సమయంతో భార్య గుర్తుకురావడంతో బిల్ వెనక్కు తగ్గుతాడు. బయటకు వచ్చాకా.. దారిలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ బయట అతికించిన మ్యూజికల్ బ్యాండ్ యాడ్ పేపర్ లో తన ఫ్రెండ్ అయిన పియానిస్ట్ పేరు, ఫొటో కనిపిస్తుంది. ఉత్సాహంగా లోపలకు వెళ్తాడు బిల్. అక్కడ ఆ పియానిస్ట్ షో ముగించుకుని కిందకు రాగానే బిల్ కనిపిస్తాడు. ఇద్దరూ కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు.
తనకు మరో షో ఉందని తను వెళ్తున్నట్టుగా పియానిస్ట్ చెబుతాడు. భార్య చెప్పిన మాటలతో మనసు చెదిరిన బిల్ తను కూడా ఆ షో కు వస్తానంటాడు. అయితే తను వెళ్లే షో కు ఎవ్వరినీ రానివ్వరని పియానిస్ట్ స్పష్టంగా చెబుతాడు. ఆ షోలో కొందరు అందగత్తెలు నగ్న ప్రదర్శన ఉంటుందని.. తను బ్యాక్ గ్రౌండ్ నుంచి ఆ షో కు పియానో వాయించాల్సి ఉంటుందంటాడు. ఈ విషయం బిల్ ను మరింత ఉత్సాహ పరుస్తుంది.
ఇంతలో పియానిస్ట్ కు ఫోన్ వస్తుంది, ఆ కాల్ లోనే ఆ షో జరిగే అడ్రస్, లోపలకు వెళ్లనివ్వడానికి పాస్ వర్డ్ చెబుతారు. వాటిని పియానిస్ట్ నోట్ చేసుకుంటూ ఉండగా.. బిల్ కాపీ కొడతాడు. పాస్ వర్డ్ తెలిసిపోవడంతో.. అక్కడకు వెళ్లడానికి డ్రస్ కోడ్ కూడా బిల్ కు చెప్పేస్తాడు ఆ పియానిస్ట్. అద్దెకు ఫ్యాన్సీ బట్టలను ఇచ్చే షాప్ దగ్గరకు బిల్ వెళ్లగా అది క్లోజ్ చేసి ఉంటుంది. దాని యజమానికి ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి విచిత్రమైన ఆ ఫ్యాన్సీ డ్రస్ ను తీసుకుంటాడు బిల్. క్లోజ్ చేసిన షాప్ లోని ఒక రూమ్ లో యజమాని కూతురు.. ఇద్దరు వృద్ధులతో సెక్స్ లో ఉంటుంది. అర్ధరాత్రి షాప్ తెరవడంతో వారు పట్టుబడతారు. అది చూసి నవ్వుకుంటూ బిల్ తన పని మీద వెళ్లిపోతాడు. ట్యాక్సీని ఎక్కువ అద్దెకు మాట్లాడుకుని నిర్జన ప్రాంతంలోని షో జరిగే బిల్డింగ్ కు వెళ్తాడు బిల్.
జరిగే షో ఏదో నిగూఢమైనది అని బిల్ కు తెలుసు. మామూలుగా అయితే ఇలాంటి వాటిల్లో తల దూర్చడు. అయితే భార్యపై ఏదో అపనమ్మకాన్ని పెంచుకున్న డిస్ట్రబెన్స్ లో ఇంటికి వెళ్లడం ఇష్టం లేక అలాంటి షో ను వెదుక్కొంటూ వెళ్తాడు. తను బయటకు వచ్చే వరకూ ఎదురుచూస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ ట్యాక్సీ డ్రైవర్ కు ఆఫరిస్తాడు. అతడు ఓకే అంటాడు. గేటు బయటే బిల్ ను పాస్ వర్డ్ అడుగుతారు. అతడు కరెక్ట్ గానే చెప్పడంతో లోపలకు పంపిస్తారు.
అక్కడ సన్నివేశాలు అత్యంత ఎరోటిక్ గా ఉంటాయి. లోపల కొన్ని వందల మంది స్త్రీలు నగ్నంగా తిరుగుతూ ఉంటారు. పురుషుల్లో కొంతమంది నగ్నంగా, మరి కొందరు మాంత్రికుల తరహాలో డ్రస్సులు వేసుకుని ఉంటారు. ప్రతి ఒక్కరికి మొహానికి ఫుల్ మాస్కులు తప్పనిసరి. బిల్ కూడా ఆ తరహా వస్త్రధారణలోనే వెళ్లి ఉంటాడు. అక్కడేం జరుగుతోందో అతడికి అర్థం కాదు కానీ, అదొక పర్వర్టెడ్ సెక్స్ పార్టీ అని అర్థం అవుతుంది.
యథేచ్ఛగా, విచిత్రంగా, అనేక రంగాల భంగిమల్లో స్త్రీ, పురుషులు సెక్స్ చేస్తుంటారు. ఆ తరహా శృంగారాన్ని అనేక మంది తనివితీరా చూస్తూ ఉంటారు. వారందరి మొహాలకూ ఉన్న మాస్కులు ఆ సీన్లను మరింత భయానకంగా చూపిస్తాయి. అదంతా ఒక సీక్రెట్ సొసైటీ. తమ విచిత్రమైన లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి, కామకేళీని జరపడానికి వారంతా అలాంటి పార్టీలను అరేంజ్ చేసుకుని ఉంటారు. తమ పార్టీలోకి బయటి వ్యక్తి వచ్చాడని నిర్వాహకులు సులభంగా పట్టేస్తారు. బిల్ ను అక్కడ నుంచి వెళ్లిపొమ్మని నగ్నంగా ఉన్న ఒక యువతి హెచ్చరిస్తుంది. ఎక్కువ సేపు ఉంటే నీ ప్రాణాల మీదకు వస్తుందని చెబుతుంది. అయినా బిల్ వినడు. వారి మధ్యనే తిరుగుతూ ఉంటాడు.
ఇంతలో మీ కారు డ్రైవర్ నిన్ను పిలుస్తున్నాడు అంటూ బిల్ ను నిర్వాహక సభ్యుడు ఒకరు పక్కకు ఈడ్చుకెళ్తాడు. ఆ సీక్రెట్ సొసైటీ కీలక సభ్యుడి ముందు ఇతడిని నిలబెడతారు. పార్టీలోని అందరి చూపూ బిల్ మీదకు మళ్లుతుంది. పర్మిషన్ లేకుండా వచ్చినందుకు శిక్షగా.. బిల్ ను నగ్నంగా మారమంటారు. బిల్ అందుకు నిరాకరిస్తాడు. ఇంతలో బిల్ ను రక్షించాలని చూసిన నగ్న యువతి.. అతడిని వదిలిపెట్టమంటుంది. అందుకు బదులుగా తనకు ఏ శిక్షను అయినా వేయమంటుంది. దీంతో నిర్వాహకులు బిల్ ను పంపించేస్తారు. ఇంటికి చేరుకున్న బిల్ మరుసటి రోజు ఫ్యాన్సీ డ్రస్ ను ఇవ్వడానికి షాప్ కు వెళ్తాడు. అక్కడ ముందు రోజు రాత్రి ఓనర్ కూతురుతో రొమాన్స్ చేసిన వృద్ధులు దర్జాగా ఉంటారు. వారితో షాప్ ఓనర్ కు ఒప్పందం కుదిరి ఉంటుంది!
తను చూసిన సీక్రెట్ సొసైటీ, పార్టీ గురించి బిల్ పరిశోధన మొదలవుతుంది. అక్కడ తన బదులు శిక్షను అనుభవించడానికి ముందుకు వచ్చిన యువతి ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది. ఇతడిని బయటకు వదిలేటప్పుడే నిర్వాహకులు.. ఇంతకు మించి ఎలాంటి వివరాలూ తెలుసుకోవడానికి యత్నించవద్దని హెచ్చరించి ఉంటారు. బిల్ ఆగడు. పియానిస్ట్ పని చేసే బార్ కు వెళ్తాడు. అది మూసేసి ఉంటుంది. పియానిస్ట్ స్టే చేసే హోటల్ కు వెళ్తే.. అతడు ఖాళీ చేసి ఉంటాడు. పియానిస్ట్ ను కొంతమంది బలవంతంగా తీసుకెళ్లిపోయారని తెలుస్తుంది. పియానిస్ట్ ద్వారానే బిల్ పార్టీలోకి ఎంటరయ్యాడని నిర్వాహకులు తేలికగానే కనుక్కొని ఉంటారు.
పేపర్లో బిల్ ను ఒక వార్త ఆకర్షిస్తుంది. ఒక మాజీ అందాల సుందరి అతిగా డ్రగ్స్ తీసుకుని మరణించిందనే వార్తను బిల్ గమనిస్తాడు. ఆమె శవం ఉన్న ఆసుపత్రికి వెళ్లి మార్చురీలో గమనిస్తాడు. ముందు రోజు రాత్రి తనను ఆ సెక్స్ పార్టీలో రక్షించినది ఆమేనని బిల్ అర్థం చేసుకుంటాడు. తనను కాపాడి ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుందని అర్థం అవుతుంది. ఆమె మరెవరో కాదు.. ఫస్ట్ సీన్లో విక్టర్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లి యువతే. అప్పుడు తను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆమె తనను రక్షించిందని బిల్ కు అర్థం అవుతుంది. ఈ వ్యవహారంలో మరింత లోతుల్లోకి బిల్ తలదూరుస్తుండగా.. సంపన్నుడు విక్టర్ నుంచి బిల్ కు ఫొనొస్తుంది. తనను కలవమని విక్టర్ పిలుస్తాడు.
బిల్ కు షాకిచ్చే చాలా విషయాలను చెబుతాడు విక్టర్. ముందు రోజు పార్టీలో జరిగిందంతా విక్టర్ చెబుతాడు. ఆ వివరాలన్నీ ఎలా తెలుసంటే.. ఆ పార్టీలో తను కూడా ఉన్నానంటూ, మాస్కుల్లో ఉన్న మనుషుల్లో తన బోటి పెద్దమనుషులు, సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వారున్నారని విక్టర్ చెబుతాడు. ఆ మాస్కుల వెనుక మనుషుల స్థాయేమిటో తెలిస్తే నువ్వు షాకవుతావని, ఆ వ్యవహారం గురించి వాకబు చేయడం మానేయాలని హెచ్చరిస్తాడు. వారనుకుంటే ఏమైనా చేయగలరంటాడు. అయితే తన వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయంటూ విక్టర్ తో బిల్ అంటాడు. కానీ, విక్టర్ అసలు కథ వేరే అంటాడు.
కేవలం నిన్ను బెదిరించడానికి మాత్రమే అక్కడ నగ్నంగా ఉన్న మోడల్ కు శిక్ష వేసే డ్రామా ఒకటి నడిచిందంటాడు. బయటకు వెళ్లాకా.. నువ్వు సీక్రెట్ సొసైటీ గురించి వాకబు చేయకుండా ఉండటానికి నడిచిన డ్రామా అదంటాడు. మరి చనిపోయిన ఆ మోడల్.. కథేంటి? అంటే.. ఆమెకు నిజంగానే డ్రగ్స్ ఎక్కువై చనిపోయిందని, ఆమె అదే రోజు చనిపోవడం కేవలం యాధృచ్ఛికమని విక్టర్ చెబుతాడు. పియానిస్ట్ ను అతడి సొంతూరికి పంపించేసినట్టుగా, ఈ పాటికి అతడు తన భార్యతో శృంగారంలో ఉంటాడంటాడు విక్టర్. ఈ సమాధానాలు నమ్మశక్యంగా లేకపోయినా బిల్ చేయగలిగేది ఏమీ ఉండదు. బ్లాంక్ ఫేస్ తోనే ఇంటికి వెళ్లి, జరిగిదంతా తన భార్యకు చెప్పి, ఆమెతో సర్దుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా ఇప్పటికి దాదాపు వందేళ్ల క్రితం డ్రీమ్ స్టోరీ పేరుతో వచ్చిన ఒక యూరోపియన్ నవల ఆధారంగా రూపొందింది. నవల్లో యూరప్ సిటీని బేస్ చేయగా, సినిమాను న్యూయార్క్ వేదికగా మార్చారు. కొద్దిగా రొమాంటిక్ డ్రామా, మరి కాసేపు ఎరోటిక్ థ్రిల్లర్ గా సాగుతుంది. ముగింపులో మళ్లీ రొమాంటిక్ డ్రామాగా ఎండ్ అవుతుంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనుషుల్లో జనించే సెక్సువల్ పర్వర్షన్స్ ను, సెక్సువల్ సీక్రెట్ సొసైటీ గురించి థ్రిల్లింగ్, ఎరోటిక్ యాంగిల్ లో చూపించిన సినిమాగా నిలుస్తుంది. ఇంకాస్త బ్యాలెన్స్ తప్పినా.. ఇదొక డార్క్ మూవీ అయ్యేది. మాస్టర్ పీస్ కాదు కానీ, అలరించే థ్రిల్లర్.
-జీవన్ రెడ్డి.బి