సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం కరోనా నుంచి కోలుకున్న ఆయన గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఘంట సాలకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కుమారులు విజయకుమార్,రత్న కుమార్,శంకర్ కుమార్, రవికుమార్, కుమార్తెలు శ్యామల, సుగుణ, మీరా, శాంతి.
ఘంటసాల, సావిత్రి దంపతుల రెండో కుమారుడైన రత్న కుమార్ తండ్రి వారసత్వంగా చిత్రపరిశ్రమలో అడుగు పెట్టారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ , హిందీ సహా వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్‌కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. రత్నకుమార్ పేరుతో డబ్బింగ్లో ఓ రికార్డు కూడా నమోదైంది.
ఏకధాటిగా ఎనిమిది గంటల పాటు డబ్బింగ్ చెప్పి రికార్డు సృష్టించారు. ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’, ‘అంబేడ్కర్’ చిత్రాలతో పాటు దాదాపు 30 సినిమాలకు ఆయన మాటలు కూడా అందించారు.
కొంత కాలం క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం నెగెటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చు కున్నారు. ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. మరోవైపు చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఘంటసాల రత్నకుమార్ మృతితో చిత్రపరిశ్రమలో విషాదంలో మునిగిపోయింది.