పవన్ కల్యాణ్ కింగ్.. చిరంజీవి కింగ్ మేకర్.. జనసైనికులు, మెగా అభిమానులతో పాటు.. బీజేపీ శ్రేణుల్లో కూడా ఇప్పుడీ చర్చ ఊపందుకుంది. మరో మూడేళ్లలో రాబోతున్న ఎన్నికల కోసం పవన్ తెరపై కింగ్ గా కనిపిస్తే, ఆ కింగ్ కు కిరీటం అందించే కింగ్ మేకర్ బాధ్యతను తెరవెనక నుంచి చిరంజీవి తీసుకుంటారట. ప్రస్తుతం దీనిపై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
చిరంజీవి సూచనల ఆధారంగా పవన్ రాజకీయం..
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో పూర్తిగా సినిమాలను పక్కనపెట్టారు పవన్ కల్యాణ్ అయితే చిరంజీవి సూచనతో ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం ఇప్పుడు చాలా గట్టిగా ఉంది. పైగా పవన్ తో పోలిస్తే, చిరంజీవికి జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు రాజకీయాలు చూసిన అనుభవం ఎక్కువ ఉంది.
కాబట్టి ఈసారి చిరంజీవి సేవల్ని పవన్ వినియోగించుకునే అవకాశం ఉంది. వారిద్దరూ కలసి పనిచేసే అవకాశం ఉందని నాదెండ్ల మనోహర్ లాంటి వారు గతంలో హింట్ కూడా ఇచ్చారు.
చిరంజీవి-పవన్ కాంబినేష్ పై ఆధారపడిన బీజేపీ..
బీజేపీకి ఏపీలో ఫేస్ వేల్యూ లేదు, ప్లేస్ వేల్యూ అంతకంటే లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే పేరుతోనే ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ నేతలు. వీరికిప్పుడు చిరంజీవి-పవన్ కల్యాణ్ కాంబినేషన్ తో విజయం సాధించాలనే తపన పెరిగింది.
ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందినవారు. రాజకీయాల్లో చక్రం తిప్పగల మూడో సామాజిక వర్గాన్ని ఏకం చేయగల నాయకులు ప్రస్తుతం లేరనే చెప్పాలి. ఆ ఆశతోనే చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఓపిక లేక వెనుదిరిగారు.
ఇప్పుడు మరోసారి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తమ్ముడిని ముందుపెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలనుకుంటున్నారు. సరిగ్గా బీజేపీ కూడా అదే ఆలోచిస్తోంది. చిరంజీవికి ఉన్న చరిష్మాను ఉపయోగించుకుని, సదరు సామాజిక వర్గాన్ని ఏకం చేసి ఓట్లు, సీట్లు సాధించాలనుకుంటోంది.
పవన్ కి ప్రాముఖ్యత పెరుగుతుందా..?
ఇప్పటివరకూ బీజేపీ డైరక్షన్లో పవన్ వెళ్లాలని ఆ పార్టీ ఆలోచించింది. అయితే ఇప్పుడు చిరు-పవన్ కాంబినేషన్ కు ఏపీలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని భావిస్తోంది. కేటాయింపుల్లో తమకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని పక్కనపెట్టి.. ముందు పవన్ ను ఫ్రంట్ సీట్ లో కూర్చోబెడితే, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే అభిప్రాయం బీజీపీలో కనిపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికలో పవన్ సీఎం అభ్యర్థి అంటూ చేసిన ప్రకటన వెనక కూడా మతలబు ఇదే. పార్టీ అధికారంలోకి రాకపోయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలిస్తే పరువు దక్కుతుందనేది బీజేపీ లోలోపల ఆలోచన.
ఇంతకీ చిరంజీవి కింగ్ మేకర్ అవుతారా?
చిరంజీవి కింగ్ కాలేకపోయారు, కనీసం కింగ్ మేకర్ అవుతారా అనేదే ఇప్పుడు ప్రశ్న. మీరు పడగొట్టాలనుకుంటే, నేను నిలబెడతానంటూ.. కాంగ్రెస్ పంచన చేరి పార్టీని కాలగర్భంలో కలిపేశారు చిరంజీవి. ఆనాడు చిరంజీవి పార్టీని విలీనం చేయకపోయుంటే రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజకీయాల్లో చిరు చక్రం తిప్పగలిగేవారని అంటారంతా.
ఆ అవకాశం ఆయనకి ఎలాగూ లేదు, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపడే ఆలోచన కూడా చిరుకి లేదు. అందుకే పవన్ కల్యాణ్ కెరీర్ పై ఆయన ఫోకస్ పెట్టారట. సినీరంగంలో తమ్ముడిని ఎలా పైకి తెచ్చారో.. సినిమాల్లో కూడా తన సపోర్ట్ తో తమ్ముడిని కింగ్ ను చేయాలనుకుంటున్నారు, తాను కింగ్ మేకర్ కావాలనుకుంటున్నారు.
అయితే సొంతానికి పనికిరాని చిరు రాజకీయ చాతుర్యం, తమ్ముడి కెరీర్ కి కలిసొస్తుందా? ఇవన్నీ పక్కనపెడితే.. అసలు చిరు తన మొహం చూపించకుండా రాజకీయం చేయగలరా? వేచి చూడాలి.