ఏడాదికో ఓటీటీ ప్రాజెక్ట్.. సీనియర్ హీరో కీలక ప్రకటన

ఆల్రెడీ ఓటీటీ స్పేస్ లోకి ఎంటరయ్యాడు వెంకీ. అయితే అతడు చేసిన రానా నాయుడు సిరీస్ పై తెలుగు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ ఫ్యామిలీ హీరో, టాలీవుడ్ సీనియర్ నటుడు,…

ఆల్రెడీ ఓటీటీ స్పేస్ లోకి ఎంటరయ్యాడు వెంకీ. అయితే అతడు చేసిన రానా నాయుడు సిరీస్ పై తెలుగు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ ఫ్యామిలీ హీరో, టాలీవుడ్ సీనియర్ నటుడు, అలాంటి బోల్డ్ కంటెంట్ లో కనిపించేసరికి చాలామంది తట్టుకోలేకపోయారు.

దీంతో రానా నాయుడుకు సీజన్-2లో ఉండదని చాలామంది భావించారు. కానీ వెంకటేశ్ మాత్రం ఉంటుందంటున్నాడు. సీజన్-2 కచ్చితంగా ఉంటుందని, కాకపోతే ఈసారి అసభ్యత తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని అంటున్నాడు.

“రానా నాయుడు సీజన్-2 ఉంటుంది. ఓటీటీ కంటెంట్ ను డిఫరెంట్ యాంగిల్ లో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఆ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే. అయితే హిందీ వెర్షన్ తో పోల్చిచూస్తే, తెలుగులో అసభ్యత బాగా తగ్గించాం. సీజన్-1కు స్వయంగా నేను రంగంలోకి దిగి చాలా తగ్గించే ప్రయత్నం చేశాను. సీజన్-2లో అలాంటి అసౌకర్యం కలగకుండా వీలైనంత ప్రయత్నిస్తాను. సీజన్-2లో తెలుగు భాష ఇబ్బందికరంగా ఉండకుండా నా వంతుగా నేను నిజాయితీగా, సిన్సియర్ గా ప్రయత్నిస్తాను.”

రానా నాయుడు సిరీస్ చేసినందుకు తానేం గిల్ట్ ఫీలవ్వడం లేదని స్పష్టం చేశాడు వెంకీ. ఎక్కడకు వెళ్లినా తనను రానా నాయుడు పాత్రతో పిలుస్తున్నారని, మొన్నటి అహ్మదాబాద్ మ్యాచ్ లో కూడా తనను నాగా నాయుడు అని అంతా పిలుస్తుంటే ఆశ్చర్యమేసిందన్నాడు.

అందుకే ఇకపై ఏడాదికి ఒక ఓటీటీ ప్రాజెక్టు చేస్తానని ప్రకటించాడు వెంకీ. ప్రస్తుతం చాలా స్క్రిప్టులు నడుస్తున్నాయని… అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు రెండూ తన కోసం కొత్త స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నాయని తెలిపాడు వెంకీ.