గీతం విద్యా సంస్థల అధినేత, నందమూరి బాలకృష్ణ అల్లుడు మతుకుపల్లి శ్రీ భరత్ సినిమా నిర్మాణంలోకి రాబోతున్నారు. గత కొంత కాలంగా బాలయ్య వ్యవహారాలను ఆయన రెండో కుమార్తె తేజస్విని దగ్గర వుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా బాలయ్య గెటప్ లు, స్టయిలింగ్ వంటివి ఆమె చూస్తున్నారు. అలాగే తండ్రితో షూటింగ్ లకు వెళ్తూ, సినిమా నిర్మాణ వ్యవహారాలను కీలకంగా పరిశీలిస్తున్నారు. త్వరలో సినిమా నిర్మాణం చేపడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తో ప్లానింగ్ లో వున్న ఆదిత్య 360 సీక్వెల్ ను స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్నారని, దానికి తేజస్విని నిర్మాతగా వుంటారని వార్తలు వున్నాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే బాలయ్యతో బోయపాటి నిర్మించే సినిమాలో ఇరవై శాతం వాటా ను తేజస్విని ఆమె భర్త భరత్ లకు వుండేలా చర్చలు సాగుతున్నాయన్నది.
బాలయ్య – బోయపాటి సినిమాను 14రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇంకా మరి కొందరు కూడా ఈ సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. అది వేరే సంగతి. ఈ సినిమాలో ఇరవై శాతం పెట్టుబడి పెట్టి, లాభాల్లో వాటా తీసుకునేందుకు తేజస్విని ఆమె భర్త భరత్ ఆసక్తిగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణం 2023 జూన్ నుంచి వుండే అవకాశం వుంది.