కరోనా మహమ్మారి దెబ్బతో అంతా అప్రమత్తం కావాల్సి వచ్చింది. గతానుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను హెచ్చరిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది. ముఖ్యంగా మన దేశానికి వెలుపల కరోనా వేగంగా విస్తరిస్తోందన్న ప్రచారం భయపెడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మహమ్మారి కట్టడికి నిబంధనలను మళ్లీ అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. విదేశీ ప్రయాణికుల ఆరోగ్యంపై పరీక్ష చేయకుండా వదిలిపెట్టకూడదనే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. విమానాశ్రయాల్లోనే ర్యాండమ్ కరోనా టెస్ట్‌లకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయ కేంద్రాల్లో ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ , ముంబయ్ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా టెస్ట్‌లు చేస్తోంది. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ అని తేలితే క్వారంటైన్‌కు లేదా వైద్యశాలకు పంపేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం, మరోవైపు మన దేశం నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవడం అభినందనలు అందుకుంటోంది. కరోనా వ్యాప్తి చెందిన తర్వాత గగ్గోలు పెట్టడం కంటే, ముందస్తు చర్యలు మంచిదని పౌర సమాజం నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.