ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పింఛన్లను కట్ చేస్తున్నారనే ఆందోళన మొదలైంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ తానిచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో రూ.250 పెంచుతూ… మొత్తం పింఛన్ 2,750కి చేర్చారు. ఎన్నికల సమయానికి రూ.3వేలు మొత్తానికి పింఛన్‌ను చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో ఒక జీతంలా పింఛన్ సొమ్మును భావిస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి పింఛన్ల కోత విధించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. నిజమే, రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లలో కోత విధిస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితర కేటగిరీల పింఛన్లను వాలంటీర్లు ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికెళ్లి మరీ అందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా… సంక్షేమ పథకాల అమలుపై ఆ ప్రభావం చూపడం లేదు.
ప్రతినెలా రూ.2,500 చొప్పున పింఛన్ సొమ్ము అందుకుంటున్న లబ్ధిదారుల్లో కోత అంశం ఆందోళన కలిగిస్తోంది. అయితే నిజమైన అర్హులకు ఎక్కడా ఇబ్బంది కలిగించడం లేదని అధికారులు వాదన వినిపిస్తున్నారు. పింఛన్ల కోతను గమనిస్తే… ప్రభుత్వ నిర్ణయంలో తప్పు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భార్యాభర్తల పేరుతో 10 ఎకరాలకు పైబడి పొలం, అలాగే కారు, కుమారుడు ట్యాక్స్ పేయర్ అయి వుండడం, దొంగ సర్టిఫికెట్లతో అర్హత సాధించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కోత విధిస్తున్నారు.
దీన్ని రాజకీయంగా ప్రతిపక్షాలు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష సానుభూతి పరుల పింఛన్లలనే తొలగిస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. పేదలు, అభాగ్యులకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో పంపిణీ చేస్తున్న పింఛన్లపై కొన్ని గద్దలు కన్ను వేయడం గమనార్హం. ఆర్థికంగా మంచి పొజీషన్‌లో ఉన్న వాళ్లు సైతం ప్రభుత్వం అందజేసే పింఛన్ కానుకకు ఆశించడం విమర్శలకు తావిస్తోంది. పింఛన్‌ను కట్ చేశారని ఆరోపించే వాళ్లు…. ఒక్కసారి తమ అంతరాత్మలకు సమాధానం చెప్పుకోవాలని అధికార పార్టీ నేతలు హితవు చెబుతున్నారు.