తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి బాగా డిమాండ్ ఏర్పడింది. వైకుంఠ ద్వారం ద్వారా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని భక్తులు తపిస్తుంటారు. గతంలో రెండు రోజులు మాత్రమే ఈ దర్శనం వుండేది. అయితే భక్తుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకున్న పాలకమండలి, ఉన్నతాధికారులు సంబంధిత నిపుణులతో చర్చించి, పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఇవాళ ఆన్‌లైన్‌లో 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. కేవలం 40 నిమిషాల్లో టికెట్ల విక్రయం జరిగింది. దీన్నిబట్టి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకో వచ్చు.
వైకుంఠ ద్వారంలో శ్రీవారిని దర్శించుకుంటే మోక్షమార్గం దక్కుతుందనే నమ్మకం వుంది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.
ఇదిలా వుండగా జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను ఇవ్వనుంది. 9 కేంద్రాల ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి వచ్చి టోకెన్లను కట్టించుకోనున్నారు. అయితే భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.