జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పోల్చి చూస్తే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయంగా బెస్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములను పక్కన పెడితే, లక్ష్మీనారాయణ స్పష్టమైన అవగాహనతో ముందుకెళుతున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే ఎక్కడ, ఏ పార్టీ తరపున పోటీ చేయాలనే అంశాలపై క్లారిటీతో ఓ ప్రకటన కూడా ఇవ్వడం విశేషం.
విశాఖ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. స్వతంత్రంగా బరిలో నిలవాలనుకోవడం గమనార్హం. ఈ మేరకు జేడీ ఫౌండేషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. జేడీ ఫౌండేషన్ సభ్యులు, సన్నిహితులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున జేడీ పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన విశాఖపై మమకారాన్ని పోగొట్టుకాలేదు. అప్పుడప్పుడు విశాఖకు వెళ్లి అక్కడి సమస్యలపై జనంతో మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
విశాఖపట్నం ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇచ్చారని, అందుకే మళ్లీ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఒక నిర్ణయానికి రాలేకున్నారు. టీడీపీతో పొత్తుపై తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీతో పొత్తు కొనసాగించాలా? వద్దా? అనే విషయమై అయోమయంలో ఉన్నారు. పవన్‌కు తన లక్ష్యంపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. కానీ లక్ష్మీనారాయణకు ఆ ఇబ్బంది లేకపోవడం వల్ల పోటీపై ఓ నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.