‘బొంకరా బొంకరా పోలిగా అంటే.. టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాడట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా అచ్చం అలాగే కనిపిస్తోంది. బొంకవా బొంకవా చంద్రబాబూ అంటే.. నేను గెలిచి ఉంటే ఎప్పుడో వృద్ధుల పెన్షను మూడువేలు చేసి ఉండేవాడినని చంద్రబాబునాయుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన రోడ్ షోలో కళ్లెదురుగా జనం కనిపించేసరికి చంద్రబాబునాయుడు ఒక రేంజిలో రెచ్చిపోయారు.
జగన్ సర్కారు మీద విమర్శలు గుప్పించడంలోనూ, జగన్ ను ఇంటికి పంపాలని పిలుపు ఇవ్వడంలోనూ రెచ్చిపోవడంలో వింతేమీ లేదు. అయితే.. ఎటూ తను వేదిక మీద ఉన్నాను గనుక.. ఎన్ని అబద్ధాలు చెప్పినా.. డబ్బులిచ్చి తోలించిన జనం తనను గల్లా పట్టుకుని నిలదేసే అవకాశం ఎటూ ఉండదు గనుక.. అబద్ధాలు చెప్పడంలో కూడా చంద్రబాబునాయుడు రెచ్చిపోయారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వృద్ధులకు తాను మాట ఇచ్చిన విధంగా.. వారి పెన్షను మూడువేలు చేసే ప్రాసెస్ లో ఉన్నారు. 2024 నాటికి మూడువేల కాగల మార్గంలో 2023 జనవరి నుంచి వారి పెన్షను మరో 250 పెంచి 2750 ఇచ్చేలా ఆదేశాలు కూడా జారీచేశారు. వృద్ధుల పెన్షను పెరిగితే ఆ వర్గంలో జగన్ పట్ల ప్రేమాభిమానాలు కూడా సహజంగానే పెరుగుతాయి. అయితే ఇలాంటివి చూసి ఓర్వలేని చంద్రబాబు.. తన నోటికి వచ్చిన ప్రలదనపు మాటలు మాట్లాడుతున్నారు. 200 నుంచి 2000 పెన్షను చేసిన ఘనత తనదేనని.. జగన్ మూడువేలు మాట ఇచ్చి 250 పెంచుతున్నారని.. తాను మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎప్పుడూ మూడువేలు చేసేసి ఉండేవాడినని ఆయన రెచ్చిపోయి అంటున్నారు.
ఇంతకంటె బేవార్సు అబద్ధాలు వేరే ఉంటాయో లేదో తెలియదు. ఎందుకంటే.. జగన్ తన పాదయాత్రలో భాగంగా పెన్షను 2000 చేస్తానని అన్నందుకు, ఎక్కడ ఆయనకు మైలేజీ దక్కుతుందో అనే భయంతోనే చంద్రబాబు తన పాలన చివరి రోజుల్లో పెన్షనును 2000 చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. దానికి పోటీగా జగన్ పెన్షను మూడువేలు చేస్తానని అన్నారు. ఆ మేర పెంచడానికి చంద్రబాబుకు ధైర్యం చాలలేదు.
2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల్లో మాఫీ చేస్తానని అంటూ.. అధికారంలోంచి దిగిపోయే నాటికి కూడా పూర్తిగా మాఫీ చేయకుండా.. రైతుల బతుకుల్ని బజార్లో పెట్టిన ఘనత చంద్రబాబునాయుడుది. అలాంటిది.. తాను ఒకేసారి 3000 పెన్షనుచేసి ఉండేవాడినని అంటే ప్రజలు నమ్ముతారా? అనేది ప్రశ్న.
అందుకే కళ్ల ముందు జనం కనిపిస్తే చాలు.. రెచ్చిపోయి మాట్లాడే చంద్రబాబు మాటలుచూసి.. బొంకవా బొంకవా పోలిగా అన్న సామెత చందంగా వ్యవహారం ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.