పులివెందుల టీడీపీ మాజీ నాయకుడు, మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు సీఎం జగన్ నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ మేరకు సతీష్‌రెడ్డితో ఇవాళ జగన్ ఫోన్లో చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. సతీష్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం వుంటుందని భావిస్తున్నారని తెలిసింది.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ముఖ్యంగా సతీష్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీకి సతీష్‌రెడ్డి దూరం కావడం చకచకా జరిగిపోయాయి. వైఎస్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సతీష్‌రెడ్డి పులివెందులలో పోటీ చేస్తూ వచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న నాయకుడిగా సతీష్‌రెడ్డికి పేరు వుంది.
టీడీపీ తనకు అన్యాయం చేసిందనే ఆవేదనతో ఆ పార్టీకి ఎస్వీ సతీష్‌రెడ్డి రాజీనామా చేశారు. వ్యాపారాల్లో మునిగితేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మళ్లీ సతీష్‌రెడ్డిని చేర్చుకోడానికి టీడీపీ పావులు కదుపుతున్నట్టు వైసీపీ పసిగట్టింది. దీంతో టీడీపీలోకి సతీష్‌రెడ్డి వెళ్లకుండా అడ్డుకునేందుకు వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఇతర నాయకులు ఆయనతో చర్చించినట్టు సమాచారం. ఎస్వీ సతీష్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకోవడం వల్లే పులివెందుల నియోజకవర్గంలో కనీసం 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను పెట్టుకోలేని దుస్థితి.
వేంపల్లి మండలం సతీష్‌రెడ్డికి సొంత గడ్డ. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెంట్లను పెట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు సతీష్‌రెడ్డికి ఉన్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యతిరేకులను దగ్గర చేసుకునే పనిలో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్న జగన్‌తో సతీష్‌రెడ్డిని చేర్చుకునే విషయమై అవినాష్, భాస్కర్‌రెడ్డి చర్చించే అవకాశాలున్నాయి. పనిలో పనిగా సతీష్‌రెడ్డితో జగన్ ఫోన్లో మాట్లాడేలా భాస్కర్‌రెడ్డి ప్లాన్ చేసినట్టు సమాచారం. వైసీపీలో చేరేందుకు సతీష్‌రెడ్డి ఎలాంటి కండీషన్స్ పెడతారో చూడాలి.