డిగ్గీరాజా.. పేచప్ చేస్తారా? పేకప్ చెప్తారా?

కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎలా పనిచేస్తోందనే సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంతవరకు పార్టీలో అంతర్గతంగా మాత్రం చాలా చక్కగా పనిచేస్తోంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తమ ఘనతగా చెప్పుకునే…

కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎలా పనిచేస్తోందనే సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంతవరకు పార్టీలో అంతర్గతంగా మాత్రం చాలా చక్కగా పనిచేస్తోంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తమ ఘనతగా చెప్పుకునే కాంగ్రెస్ వ్యవహారాలు, ఇప్పుడు వారిని బజార్న పెట్టాయి. ముఠాకుమ్ములాటలు తారస్థాయిలో ఉన్నాయి. 

కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న నాయకులు, వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్న నాయకులు, వెలుపలి నుంచి వచ్చిన నాయకులు అందరూ కలిసి ముఠాలుగా పార్టీని ముంచే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ ముఠాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రత్యేకంగా ఢిల్లీనుంచి వచ్చిన డిగ్గీ రాజా.. ముఠా తగాదాలను సర్దిచెప్పి పేచప్ చెప్తారా? లేదా, ఏకంగా పార్టీకి పేకప్ చెప్తారా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

డిగ్గీరాజా ప్రత్యేకంగా ఢిల్లీనుంచి వచ్చారు. ఆల్రెడీ ప్రధాని మోడీతో కూడా భేటీ అయి.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీచేస్తానో తర్వాత చెప్తానని తన ఫిరాయింపు వార్తలకు కూడా సంకేతాలు అందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అనేక మంది నాయకులు డిగ్గీరాజాను గాంధీభవన్ లో కలిశారు. సహజంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద వాళ్లందరూ కలిసి బోలెడు ఫిర్యాదులుచేశారు. అయితే డిగ్గీరాజా మాత్రం.. వారి ఫిర్యాదులను ఆలకించి.. రేవంత్ ని తీరుమార్చుకోమని చెప్పడానికి రాలేదన్నట్టుగా వ్యవహరించారు. 

రేవంత్ తో కలిసి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అసంతృప్త నాయకులకే ఆయన ఎక్స్ ట్రా హితోపదేశం చేశారు. వారినే మందలించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు తెలంగాణ కాంగ్రెస్ ముఠా కుమ్ములాటలకు డిగ్గీరాజా ఫుల్ స్టాప్ పెట్టడం, పేచప్ చేయడం సాధ్యమేనా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో.. ఆయన మీడియాను ఉద్దేశించి చెబుతున్న కబుర్లు కూడా పార్టీకి ఉపయోగపడేవి కాదు. కేసీఆర్ సర్కారు మీద రెగ్యులర్ పాచిపోయిన విమర్శలకు పరిమితం అయిన దిగ్విజయ్ సింగ్.. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఏర్పడింది అని చరిత్రను తవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎలా, ఎవరి వలన ఏర్పడిందనే సంగతి ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాత్రమే రాష్ట్రం ఇచ్చిందనే అవగాహన వారికి ఉంది. అయితే.. అందుకు కాంగ్రెస్ కు రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని తెలంగాణ సమాజం రెండు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చాటిచెప్పింది. 

ఇప్పుడింకా.. మేం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఇచ్చాం అని డిగ్గీరాజా ప్రవర చెప్పుకుంటే ఏం ఒరుగుతుంది. పార్టీలో ముఠాలను బుజ్జగించి.. అందరినీ ఏకతాటిమీదకి తెమ్మని పంపితే.. అది వదిలేసి.. పార్టీఘనతను పాచిపోయిన డప్పు కొట్టడం ప్రారంభిస్తే ఆయన ఏం సాధిస్తారు? అని పార్టీ నాయకులే పెదవివిరుస్తున్నారు.