క్రిస్మస్ వేడుకలకు వైఎస్ కుటుంబ సభ్యులంతా ఒక చోట కలవడం గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. ఆ సంప్రదాయానికి షర్మిల తిలోదకాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల దూరంగా ఉండనున్నారని సమాచారం. ఇప్పటికే ఆమె అమెరికా వెళ్లారు. దీంతో క్రిస్మస్ వేడుకలకు ఆమె వెళ్లే అవకాశం లేదని వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు.
ప్రతి క్రిస్మస్కు ముందు రోజు వైఎస్ కుటుంబ సభ్యులంతా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ఇడుపులపాయకు చేరుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇడుపులపాయలోనే 24వ తేదీ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, అందరూ కలిసి విందు ఆరగించడం, కష్టసుఖాలు తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చొరవ చూపుతూ వైఎస్సార్ ఓ ఒరవడిని నెలకొల్పారు. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో రాజకీయంగా, వ్యక్తిగతంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెమ్మదిగా కుటుంబ ఐక్యతకు బీటలు వారాయి.
వివేకా హత్యతో వైఎస్ కుటుంబంలో ఎడబాటు మరింత పెరిగింది. వైఎస్ జగన్‌కు షర్మిల దూరం కావడం తెలిసిందే. తెలంగాణలో వద్దన్నా ఆమె సొంత పార్టీ పెట్టుకున్నారు. షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ వేడుకలకు కొద్ది మంది వైఎస్ కుటుంబ సభ్యులు మాత్రమే కలుస్తున్నారు.
షర్మిల, డాక్టర్ సునీత తదితర కుటుంబాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. దివంగత వైఎస్సార్‌కు షర్మిల లేకుండా జగన్, ఆయన తల్లి విజయమ్మ నివాళులర్పించనున్నారు. జనవరి మొదటి వారంలో అమెరికా నుంచి షర్మిల తిరిగిరానున్నట్టు సమాచారం. కాలం తీసుకొచ్చిన మార్పులతో పాటు నడవడం తప్ప ఎవరికైనా మరో గత్యంతరం లేదు.