ఎఫ్3.. ప్రచారం ఫుల్, పైరసీపై నిఘా నిల్

ఎఫ్3.. ఈమధ్య కాలంలో ఈ సినిమాకు చేస్తున్నంత ప్రచారం, బహుశా ఇంకో సినిమాకు చేయలేదేమో. హీరోలు, దర్శకుడు, నిర్మాత.. ఇలా అంతా కలిసి ఎఫ్3కి భారీగా ప్రచారం కల్పిస్తున్నారు. విడుదలకు ముందు సినిమాను ఎంత…

ఎఫ్3.. ఈమధ్య కాలంలో ఈ సినిమాకు చేస్తున్నంత ప్రచారం, బహుశా ఇంకో సినిమాకు చేయలేదేమో. హీరోలు, దర్శకుడు, నిర్మాత.. ఇలా అంతా కలిసి ఎఫ్3కి భారీగా ప్రచారం కల్పిస్తున్నారు. విడుదలకు ముందు సినిమాను ఎంత ప్రమోట్ చేశారో, రిలీజ్ తర్వాత కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా విశాఖలో కూడా ఓ భారీ ఈవెంట్ నిర్వహించారు.

ఇలా ఎఫ్3 సినిమాకు భారీగా ప్రచారం కల్పిస్తున్న యూనిట్.. ఆ హడావుడిలో కీలకమైన ఓ విషయాన్ని మరిచిపోయింది. అదే పైరసీ. అవును.. ఎఫ్3 సినిమా పైరసీకి గురైంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కడ చూసిన ఆ సినిమా పైరసీ వీడియోలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. 'ఎఫ్3 కామెడీ థియేటర్' అని సెర్చ్ చేస్తే చాలు వందల సంఖ్యలో వీడియోలు వస్తున్నాయి. ఇవన్నీ థియేటర్లలో షూట్ చేసిన విజువల్స్.

సాధారణంగా ఓ సినిమా రిలీజైన వెంటనే పైరసీ అయిపోతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. అయితే యూట్యూబ్ లో మాత్రం పైరసీ జరగకుండా ఆపొచ్చు. దీనికి సంబంధించి చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయి. టీమ్ కంప్లయింట్ చేస్తే చాలు నిమిషాల్లో ఆ వీడియోలన్నీ యూట్యూబ్ నుంచి డిలీట్ అవుతాయి.

కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఆ వీడియో క్లిప్స్ అన్నీ యూట్యూబ్ లో కనిపిస్తున్నాయి, వందలు-వేలల్లో వ్యూస్ కూడా వస్తున్నాయి. పైరసీపై యూనిట్ ఎంత కేర్ తీసుకుంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఓవైపు తమ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదని, థియేటర్లకు అంతా వచ్చి సినిమాను ఎంజాయ్ చేయమని యూనిట్ చెబుతోంది. మరోవైపు యూట్యూబ్ లో ఇలా కీలకమైన సన్నివేశాలు (క్లైమాక్స్ తో సహా), అదిరిపోయే కామెడీ ఎపిసోడ్స్ అన్నీ దర్శనమిస్తున్నాయి. వీటని అరికట్టకుండా, ఆడియన్స్ ను థియేటర్లకు రమ్మని కోరడంలో అర్థం లేదు.