టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సీపీఐ జేబు పార్టీ అంటే … ఆ పార్టీ నేతలకు కోపం వస్తుంది. ఆచరణలో మాత్రం టీడీపీకి అనధికార ప్రతినిధుల్లా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహరిస్తూ వుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడంతో చంద్రబాబు మనసెరిగి ఈ ఇద్దరు నేతలు మెలుగుతుంటారనే అభిప్రాయాలున్నాయి. చంద్రబాబుతో నారాయణది “కమ్మ”ని బంధం. ఇద్దరిదీ ఒకే జిల్లా. రాజకీయంగా ఇద్దరూ సమకాలికులు.
నారాయణకో ప్రత్యేకత ఉంది. బోళా మనిషని పేరు. చాలా సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. సమాజ చలనం కంటే, సంచలనాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే నోటికి హద్దుఅదుపూ లేకుండా మాట్లాడుతూ, పార్టీ పెద్దల చీవాట్లతో నాలుక్కరుచుకుంటుంటారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన సవాల్ విసరడం చర్చనీయాంశమైంది.
అమరావతి ఉద్యమం 900వ రోజుకు చేరుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ …. “గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు స్థానంలో దమ్ముంటే పోటీ చేయండంటూ వైసీపీ వాళ్లు తొడలు గొట్టి, సవాలు విసురుతున్నారు. నేనూ ఓ సవాలు విసురుతున్నా. జగన్‌కు దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్నే మేనిఫెస్టోలో పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా రాజీనామా చేసి, రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలకు రావాలి. ఎన్నికల్లో ఓడిపోతే అండమాన్‌కు పోవాలి” అని అన్నారు.
నారాయణ సవాల్‌ను స్వీకరించిన జగన్ ఎన్నికలకు వెళ్లారని అనుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పోటీ చేసే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలెన్నో నారాయణ చెప్పగలరా? పట్టుమని ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేని నిస్సహాయ స్థితిలో సీపీఐ ఉంది. అలాంటప్పుడు ఎవరి కోసం, ఎందుకోసం ఎన్నికలు రావాలని నారాయణ ఆరాటపడుతున్నారో జగమెరిగిన సత్యమే.
చంద్రబాబు కోసం జగన్‌కు సవాల్ విసిరేందుకు కొంచెమైనా సిగ్గుండాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సీపీఐని టీడీపీ అనుబంధ పార్టీ అని పిలవడం. నారాయణ లాంటి నాయకుడు జాతీయ కార్యదర్శి కావడం సీపీఐ పతనావస్థకు నిదర్శనమంటే కాదనగలరా?