జనసేన బతుకును టీడీపీ బజారుకీడ్చింది. రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని అనుకుంటున్న తరుణంలో టీడీపీ రివర్స్ ఎటాక్‌కు దిగడం ఆసక్తికర పరిణామం. జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లు పెట్టడం కీలక ఘట్టంగా చెప్పొచ్చు. అలాగే 2024లో టీడీపీ తగ్గాలని జనసేనాని సూచించారు. దీనిపై టీడీపీ మండిపడుతోంది. జనసేనాని పవన్ ఏమన్నారు, టీడీపీ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం.
“నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాను. అన్నిసార్లూ తగ్గుతానని చెప్పను. తగ్గాల్సినంత వరకూ తగ్గాను. 2014లో ఒకసారి, 2019లో ఒక ప్రకటన ఇచ్చేందుకు తగ్గాను. 2024లో తగ్గడానికి సిద్ధంగా లేం. ఈ సారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని నా కోరిక” అని పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ఘాటుగా స్పందించారు.
“పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్స్ పెట్టుకోవడం వారి అంతర్గత విషయం. 2019లో పవన్‌కల్యాణ్ ఎక్కడా తగ్గలేదు. 137 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. మిగతా స్థానాల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీ నిలిచాయి. జనసేనకు 16 స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కాయి. అందులో ఒక స్థానం గెలిచింది. 2014లో జనసేన తగ్గిందని అనరు. పోటీ చేసి, సీట్లు పంచుకున్నప్పుడు మాత్రమే తగ్గడం, పెరగడం అనేది ఉంటుంది. అప్పుడు పార్టీ కొత్తగా పెట్టుకున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో లేదు కాబట్టి పోటీ చేయలేదు. టీడీపీని ఉద్దేశించి పవన్ ఒక మాటన్నారు. ఒన్‌సైడ్ లవ్ అన్నది జనసేనను ఉద్దేశించి కాదని ఆ తర్వాత పార్టీ క్లారిటీ ఇచ్చింది. అలాగే వార్ ఒన్‌సైడ్ అంటే వైసీపీ పూర్తిగా ఓడిపోతుందని, ప్రతిపక్షాలు గెలవబోతున్నాయని అర్థం. అలాగే త్యాగాలకు సిద్ధపడ్డామని చంద్రబాబు చెప్పడం వెనుక …పార్టీలో సీనియర్లను దృష్టిలో పెట్టుకుని అన్నమాటలే” అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి స్పష్టం చేశారు.
వన్‌సైడ్ లవ్, త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు అన్న మాటలు తమ గురించే అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఆ పార్టీ నాయకులు ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన జీవీరెడ్డి ఒక్క దెబ్బతో జనసేనకు దిమ్మతిరిగింది. ఆ పార్టీ గాలి తీశారు. 2014, 2019లోనూ జనసేన తగ్గలేదని ఆయన కొట్టి పారేశారు. గత ఎన్నికల్లో కేవలం 16 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేనకు డిపాజిట్లు దక్కాయని చెప్పి ఆ పార్టీ బతుకును బజారుకీడ్చారు. తాను లేకపోతే టీడీపీ అధికారంలోకి రాలేదనే జనసేన అహంకారాన్ని జీవీరెడ్డి భారీ దెబ్బతీశారు. జీవీరెడ్డికి పద్ధతైన నాయకుడని పేరు.
ఆయన ఎక్కడా బ్యాలెన్స్ తప్పి మాట్లాడరని గుర్తింపు వుంది. లెక్కలతో సహా వివరించడంలో జీవీరెడ్డి దిట్ట. పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లు చెప్పిన వెంటనే జనసేన కెపాసిటీ ఏంటో జీవీరెడ్డి చెప్పారంటే, ఆ పార్టీతో పొత్తు విషయంలో టీడీపీ పక్కా వ్యూహంతో వెళుతోందని అర్థం చేసుకోవాలి. జనసేనను టీడీపీ ఆరో ఫింగర్‌గా భావిస్తుందనేందుకు జీవీరెడ్డి విశ్లేషణే నిదర్శనం.
సొదుం రమణ