జనసేనాని పవన్‌కల్యాణ్ తాజా వైఖరిపై ఆయన సామాజిక వర్గీయుల్లోని మెజార్టీ ప్రజలు సంబరపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో ‘ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ప్రకటించి, జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపారు. మళ్లీ చంద్రబాబును సీఎం చేయడానికి, టీడీపీ పల్లకీ మోయాలని పరోక్ష సంకేతాలు ఇవ్వడంపై కాపులు లోలోన గుర్రుగా ఉన్నారు. ఆఫ్ ది రికార్డుగా పవన్‌కల్యాణ్‌పై మండిపడే వారు.
ఈ నేపథ్యంలో మంగళగిరిలో శనివారం జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ ముగింపు ప్రసంగంపై ఆ పార్టీ శ్రేణులు, కాపులు ఖుషీగా ఉన్నారు. సమావేశంలో పవన్ ప్రసంగిస్తున్నప్పుడు రియాక్షన్‌ను బాగా గమనిస్తే, వారి మనసుల్లో ఏముందో అర్థమవుతుంది.
‘వచ్చే ఎన్నికల్లో మాకు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది బీజేపీతో కలిసి ప్రభుత్వ స్థాపన, రెండోది బీజేపీ, టీడీపీలతో కలిసి అధికారంలోకి రావడం, మూడోది జనసేన ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం’ అని పవన్ పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన నాయకులు మూడో ఆప్షన్‌కు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలకడం విశేషం. ముఖ్యంగా టీడీపీ, బీజేపీలతో పొత్తు విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఎలాంటి స్పందనా రాకపోవడాన్ని గమనించొచ్చు. అలాగే మరో సందర్భంలో పవన్ వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉన్నాయని వారు అంటున్నారు.
‘2014లో తగ్గాను. 2019లోనూ తగ్గాను. 2024లో మాత్రం తగ్గేందుకు సిద్ధంగా లేను. రాష్ట్రం కోసం అన్నిసార్లు నేను తగ్గాను. ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాను’ అని పవన్ సూచించారు. చంద్రబాబునాయుడిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికే జనసేనాని ఉన్నారని, టీడీపీ పల్లకీ మోయడానికి జనసేన సిద్ధంగా ఉండాలని అధికార పార్టీ వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ నాయకుడి ప్రకటనలు కూడా అదే అర్థాన్ని ధ్వనింప చేస్తుండడంతో సమాధానం చెప్పడానికి జనసేన నేతలు ఇబ్బంది పడేవారు.
నిన్నటి సమావేశంలో పొత్తులపై జనసేనాని క్లారిటీ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలాక్ష్‌గా ఉన్నారు. ఎట్టి పరిస్థితు ల్లోనూ పవన్‌కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని, టీడీపీ తమకు మద్దతు ఇవ్వాలని జనసేన నాయకులు స్వరం పెంచడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. తమ వెంట టీడీపీ నడవాలని జనసేన డిమాండ్ చేయడం గమనార్హం. 2024లో తాను తగ్గేదేలేదని పుష్ప సినిమా డైలాగ్ చెప్పి, జనసేన శ్రేణుల్ని పవన్ ఉత్సాహపరిచారు.
ముఖ్యంగా టీడీపీ ఎదుట తల ఎత్తుకునేలా పవన్‌కల్యాణ్ తాజా ప్రకటన ఉందని ఆయన సామాజిక వర్గ యువత, నాయకులు చెబుతుండడం విశేషం. అయితే పవన్‌కల్యాణ్ తన మాటమీద నిలబడాలని వారంతా కోరుకుంటున్నారు.