సత్యాలు వెల్లడించిన ఆర్కే

కొత్త జిల్లాలు ప్రకటించిన దగ్గర నుంచి ఒక సెక్షన్ మీడియాలో ఒకటే హడావుడి. జిల్లా కేంద్రాలకు దూరమై చాలా మంది గోల గోల చేస్తున్నారంటూ. ఆ మీడియాల జాబితాలో ఆంధ్రజ్యోతి కూడా వుంది. కానీ…

కొత్త జిల్లాలు ప్రకటించిన దగ్గర నుంచి ఒక సెక్షన్ మీడియాలో ఒకటే హడావుడి. జిల్లా కేంద్రాలకు దూరమై చాలా మంది గోల గోల చేస్తున్నారంటూ. ఆ మీడియాల జాబితాలో ఆంధ్రజ్యోతి కూడా వుంది. కానీ గమ్మత్తుగా అదే మీడియా అధినేత ఆర్కే ఈ రోజు తన స్వంత కాలమ్ లో మరో ముచ్చట కూడా రాసారు.

‘’జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఉండదు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు అంతగా ఉండడం లేదు. అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి..’’

మరి గత రెండు మూడు రోజులుగా జిల్లా కేంద్రాలు జ‌నాలకు దూరమైపోయాయి అంటూ నానా యాగీ చేయడం ఎందుకో? అసలు కొత్త జిల్లాలే అవసరం లేదనుకున్నపుడు, జ‌నాలకు జిల్లా కేంద్రంతో అవసరమే వుండదనకున్నపుడు మరి ఇంక మరి ఈ పుంఖానుపుంఖాల వార్తలతో యాగీ ఎందుకు? జ‌నాలను రెచ్చగొట్టేలా హడావుడి ఎందుకు? ఇదే మాట అక్కడ రాసి సర్ది చెప్పవచచ్చు కదా? కొత్త జిల్లాలు అవసరమే లేదంటారు. మళ్లీ మండలాల ఏర్పాటు వల్ల మంచి జ‌రిగింది అంటారు.

‘’..ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు పాలన అని చెప్పుకోవడంలో అర్థం లేదు. ఉమ్మడిరాష్ట్రంలో ఎన్‌.టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల అప్పట్లో ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణలో పది జిల్లాలను విడగొట్టి 33 జిల్లాలను చేశారు. దీనివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు…’’

నిజ‌మే మండలాల ఏర్పాటు వల్ల మంచి జ‌రిగింది. అందులో సందేహం లేదు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు వల్ల కూడా మేలు జ‌రిగింది. గ్రామాల జ‌నాలు ఎమ్మార్వో కార్యాలయానికి, మండల కార్యాలయానికి రానవసరం లేకుండానే పనులు జ‌రుగుతున్నాయి. 

వీఆర్వోలు, సర్వేయర్లు, వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లోనే అందుబాటులో వుంటున్నారు. మరి ఆ విషయాన్ని ఆర్కే ఎందకు అంగీకరించరు. ఎందుకు ప్రస్తావించరు? చెడును చెడు అని చెప్పడమే కాదు, మంచిని మంచి అని కూడా చెపితే కదా ఆర్కే నిస్పక్షపాతికత వెల్లడవుతుంది?

సమ్మెకు ఉసిగొల్పుతూ

ఆర్కే మరో వైనం కూడా కొత్త యాంగిల్ లో వినిపించారు. ఉద్యోగులను సమ్మెకు కావాలనే జ‌గన్ ఉసిగొల్పుతున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి కనీసం అయిదువేల కోట్లు మిగిలే అవకాశం వుందంటున్నారు. గతంలో సమ్మెకు వెళ్తే, సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్ గా పరిగణించి జీతాలు ఇచ్చేవారని, జ‌గన్ అలా చేసే అవకాశం లేదని, అందువల్ల సమ్మెకు వెళ్లకుండా వుంటే బెటర్ అనేలా ఆర్కే హితవు చెబుతున్నారు.

మరి అదే ఆర్కే నిత్యం పతాక శీర్షికల్లో ఉద్యోగులకు ఆవేశం కలిగేలా, ప్రభుత్వం అన్యాయం చేస్తోందనేలా ఎందుకు వార్తలు వండి వారుస్తున్నట్లు? ఈ హితవు ఏదో అక్కడే చెప్పవచ్చు కదా? సమ్మెకు వెళ్లకండి. నష్టపోతారు అని చెబితే, రెండు విధాలా ఉపయోగం కదా? ఉద్యోగులకు మేలు చెేసినట్లు అవుతుంది. ప్రభుత్వాన్ని అయిదు కోట్ల ఖర్చుతో ఇరుకునపెట్టినట్లు అవుతుంది కదా?

ఏమిటో నిత్యం వార్తలు చూస్తే ఓ విధంగా వుంటాయి. ఈ వ్యాసాలు చూస్తే మరోలా వుంటాయి. ఎప్పుడు తోచిన పాయింట్ అప్పుడు పట్టుకుని ప్రభుత్వంపై నెగిటివిటీని చూపించాలనే ప్రయత్నంలో క్లారిటీ మిస్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ అవుతున్నట్లుంది.