ప్రతిపక్షాలు అక్కర్లేదు.. ఆ పేపర్లున్నాయిగా..?

పీఆర్సీ ఉద్యమం వెనక ఎవరూ లేరు, రాజకీయ నాయకుల సపోర్ట్ మాకు అక్కర్లేదు అనేది ఉద్యోగ సంఘాల మాట. ప్రతిపక్షం సంగతి పక్కనపెడితే.. టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఈ ఉద్యమాన్ని పూర్తిగా తమ…

పీఆర్సీ ఉద్యమం వెనక ఎవరూ లేరు, రాజకీయ నాయకుల సపోర్ట్ మాకు అక్కర్లేదు అనేది ఉద్యోగ సంఘాల మాట. ప్రతిపక్షం సంగతి పక్కనపెడితే.. టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఈ ఉద్యమాన్ని పూర్తిగా తమ భుజానికెత్తుకుంది. 

నిరసనలు, ధర్నాలను హైలెట్ చేస్తూ ఉద్యోగుల పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలని చూస్తోంది. అదే సమయంలో వారిని రెచ్చగొట్టి మాట్లాడించి, ప్రభుత్వానికి మరింత వ్యతిరేకంగా మారుస్తోంది. ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వకముందు ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించాయి. 

తీరా పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు చేసుకుని, ఏ రాజకీయ పార్టీ మద్దతు తమకు అవసరం లేదని చెప్పి, సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు ఉద్యోగులు. అయితే ఇక్కడ వారికి తెలియని విషయం ఏంటంటే.. వారు ఆల్రడీ టీడీపీ అనుకూల మీడియా ట్రాప్ లో పడిపోయారు. పదే పదే జగన్ పై సెటైరిక్ సినిమా పాటలు పాడించింది ఎవరు, వాటిని హైలెట్ చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్ర వేయించింది ఎవరు..?

చర్చలకు ఉద్యోగులు ఎందుకు రావడంలేదని మంత్రుల బృందాన్ని వారే ప్రశ్నిస్తారు. మీరే చర్చలకు వెళ్లకుండా బెట్టు చేస్తున్నారట కదా అంటూ ఇటు ఉద్యోగుల్ని రెచ్చగొడతారు. ఇలా ఇద్దరి మధ్య తగువులు పెట్టి చివరకు గొడవని పెద్దది చేశారు, మరింత పెద్దది చేస్తున్నారు.

ఇప్పటివరకూ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులే ఫోకస్ అయ్యారు. ఇటీవల రిలే నిరాహార దీక్షల సందర్భంగా జిల్లా నాయకులకు ఎక్కడలేని ప్రచారం ఇస్తోంది టీడీపీ అనుకూల మీడియా. ఒకరకంగా వారికి లేనిపోని ప్రచారం కల్పించి, రెచ్చగొట్టి మరీ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తోంది. 

సమ్మెకు అనుకూలం కాదంటూ కొన్ని సంఘాలు చెబుతున్నా కూడా వారిని సదరు టీడీపీ మీడియా పట్టించుకోదు. ప్రభుత్వాన్ని తిడితేనే వారికి వార్త. ఇప్పుడిక ఎస్మా వార్తల్ని కూడా ముందుగా హైలెట్ చేసింది టీడీపీ బ్యాచ్ నే. 

ఉద్యోగుల్లో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తోంది. వీలైతే సమస్యని పరిష్కరించే సూచనలు చేయాలి కానీ, ఇలా సమస్యని పెంచి పెద్దది చేసి తమాషా చూడాలని అనుకోకూడదు. ప్రతిపక్షాలు మిస్సయ్యామని అనుకున్నా.. ప్రతిపక్ష అనుకూల మీడియా ఆ పని సమర్థంగా చేస్తోంది.