ఈ ఒక్కసారి వద్దు సార్.. ఇళయరాజాపై వ్యతిరేకత

తను కంపోజ్ చేసిన పాటల రాయల్టీకి సంబంధించి సంగీత దర్శకుడు ఇళయరాజా కొన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నిర్మాతలు.. రాయల్టీ చెల్లించకుండా తన పాత పాటల్ని…

తను కంపోజ్ చేసిన పాటల రాయల్టీకి సంబంధించి సంగీత దర్శకుడు ఇళయరాజా కొన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నిర్మాతలు.. రాయల్టీ చెల్లించకుండా తన పాత పాటల్ని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆయన పోరాటం చేస్తున్నారు. తాజాగా ఈయన మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు కూడా నోటీసులిచ్చారు.

కమల్ హాసన్ హీరోగా నటించిన గుణ చిత్రంలోని “కమ్మని ఈ ప్రేమ లేఖనే” అనే సాంగ్ ను మంజుమ్మెల్ బాయ్స్ లో వాడారు. తన అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా పాటను వాడడంపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతలకు నోటీసులు పంపించారు.

ఇళయరాజా వైఖరికి నిరసనగా..

అయితే ఈసారి మాత్రం ఇళయరాజాకు మద్దతు దక్కలేదు. ఎందుకంటే, మంజుమ్మెల్ బాయ్స్ లో ఆ పాట తప్పనిసరి. గుణ కేవ్స్ పై తీసిన సినిమా ఇది. పైగా యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కింది. అందుకే సందర్భానుసారం ఆ పాట వాడుకోవాల్సి వచ్చింది. కానీ ఇళయరాజా మాత్రం ఊరుకోలేదు. తను నమ్మిన సిద్ధాంతంపై ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో ఇళయరాజాపై నిరసనగా సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. ఓవైపు ఆయన చేస్తున్న న్యాయ పోరాటాన్ని మెచ్చుకుంటూనే, మరోవైపు మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను మాత్రం విడిచిపెట్టాలని చాలామంది కోరుతున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే జనాల్లో కల్ట్ స్టేటస్ వచ్చేసింది. అందుకే ఈ నిరసన.

పెద్దోళ్లను సైతం వదలని ఇసైజ్ఞాని..

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వినతుల్ని ఇళయరాజా పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే, రాయల్టీ విషయంలో ఆయన పెద్ద పెద్దోళ్లనే వదల్లేదు. తన ప్రాణస్నేహితుల్ని కూడా ఇందులోకి లాగారు. తనకు డబ్బు చెల్లించకుండా కచేరీల్లో తన పాటల్ని ఎస్పీ బాలు ఆలపించడంపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. వీళ్లది దశాబ్దాల స్నేహబంధం. అయినప్పటికీ ఇళయరాజా వెనక్కు తగ్గలేదు. దీంతో ఇళయరాజా పాటల్ని స్టేజ్ పై ఆలపించడానికి బాలు నిరాకరించారు.

ఇది మాత్రమే కాదు, తాజాగా రజనీకాంత్ సినిమాకు కూడా నోటీసులిచ్చారు ఇళయరాజా. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. ఇందులో ఇళయరాజా పాత పాటను వాడుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సన్ పిక్చర్స్ కు ఆయన లీగల్ నోటీసిచ్చారు. రజనీ-ఇళయరాజా ది దశాబ్దాల అనుబంధం.

ప్రస్తుతం పాటలకు సంబంధించిన రాయల్టీని మ్యూజిక్ కంపెనీలు, నిర్మాతలు మాత్రమే పొందుతున్నారు. ఇందులో తనకు కూడా వాటా కావాలని ఇళయరాజా వాదిస్తున్నారు. డబ్బులిచ్చి పని చేయించుకున్న తర్వాత, సంపూర్ణ హక్కులన్నీ నిర్మాతకే చెందుతాయనే వాదనను ఇళయరాజా తోసిపుచ్చుతున్నారు. దీనిపై కొన్నాళ్లుగా చర్చ సాగుతూనే ఉంది.