సెట్స్ లో జూనియర్లకు సీనియర్లు సలహాలు ఇవ్వడం చాలా కామన్. కొంతమంది వాటిని విని వదిలేస్తారు, మరికొంతమంది వాటిని తమ కెరీర్ కోసం చక్కగా వాడుకుంటారు. అలాంటి ఓ సలహా తన కెరీర్ కు బాగా పనికొచ్చిందని చెబుతోంది కాజల్. ఈ హీరోయిన్ కు ఆ సలహా ఇచ్చిన హీరో అల్లు అర్జున్.
“బన్నీ నాకు అమూల్యమైన సలహా ఇచ్చారు. ఇప్పటివరకు నేను ఆ సలహాను పాటిస్తూనే ఉన్నాను. ఏదైనా సన్నివేశంలో నటిస్తున్నప్పుడు కట్ అని చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్ ను కొన్ని సెకెన్ల పాటు కొనసాగించాలని బన్నీ నాతో చెప్పాడు. డైరక్టర్ కట్ చెప్పిన తర్వాత వెంటనే డ్రాప్ అయిపోవద్దు. ఆ ఎమోషన్ ను హోల్డ్ చేయాలని చెప్పాడు. కెమెరా ఆగిన తర్వాతే పెర్ఫార్మెన్స్ ఆపాలని చెప్పాడు. ఎందుకంటే, అలా అదనంగా మనం ఇచ్చే ఎమోషన్ ఎడిటింగ్ లో చాలా ఉపయోగపడుతుంది.”
డైరక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత పాత్రలోకి వెళ్లడానికి 10-15 సెకెన్లు పడుతుందని, సీన్ లో నటించేది 20 సెకెన్లు మాత్రమే ఉంటుందని, కట్ చెప్పిన తర్వాత కెమెరా ఆపడానికి 10 సెకెన్లు పడుతుందని, ఆ 10 సెకెన్ల పాటు ఎమోషన్ ను కొనసాగిస్తే ఎడిటింగ్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని బన్నీ తనకు చెప్పాడని, ఇప్పటికీ తను ఆ సలహాను పాటిస్తున్నానని కాజల్ తెలిపింది.
ఇండస్ట్రీలో ప్రస్తుతం కొనసాగుతున్న హీరోయిన్లలో సమంత, తమన్న తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతోంది కాజల్. బిజీ షెడ్యూల్స్ వల్ల తామంతా కలిసేది చాలా తక్కువ అయినప్పటికీ, కలిసిన ప్రతిసారి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తామని చెబుతోంది. తమ మధ్య సినిమా-కెరీర్ కు సంబంధించిన చర్చలు మాత్రం రావని అంటోంది.