ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పెద్ద ఊరట లభించింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం సృష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేస్తూ.. ఎమ్మెల్యేపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది.
రెండు రోజుల క్రితం టీడీపీ సోషల్ మీడియాలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్లు ఉన్న వీడియోను పెద్ద ఎత్తున్న వైరల్ చేయడంతో రంగంలోకి దిగిన ఈసీ ఎమ్మెల్యేను వెంటనే ఆరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అరెస్ట్ చేయకుండా పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కాగా పిన్నెల్లి వీడియోపై వైసీపీ నుండి కౌంటర్ గా.. ‘రెంటచింతల మండలం పాల్వాయిగేటులో టీడీపీ గూండాలు వైసీపీ ఏజెంట్లని కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపి.. వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా వారిపై దాడి చేశారు. సమాచారం అందగానే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కూడా దౌర్జన్యం చేశారు. టీడీపీ ఓటమికి సాకుల కోసం అసలు విషయాలు దాచేసి.. తప్పుడు ప్రచారంతో బురదజల్లుతున్నారు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.