బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నేరుగా ముంబయిలో తన నివాసానికి చేరుకున్నాడు. ఎక్కడా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డాడు.
నిన్న అహ్మదాబాద్ లో షారూక్ ఖాన్ వడదెబ్బకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే అతడ్ని కేడీ హాస్పిటల్ లో చేర్చారు. ఈరోజు సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న షారూక్, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.
హాస్పిటల్ నుంచి నేరుగా విమానాశ్రయం చేరుకొని, అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకున్నాడు. ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కారులో తన ఇంటికి వెళ్లిపోయాడు. ఎక్కడా షారూక్ ముఖం కనబడనీయకుండా అతడి సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. గొడుగు అడ్డం పెట్టి మరీ ఫొటోలు తీయకుండా అడ్డుకున్నారు.
ప్రస్తుతానికి షారూక్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, మరో 3 రోజుల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ముంబయి చేరుకున్న తర్వాత మేనేజర్ పూజ దడ్లానీ, షారూక్ ఆరోగ్య స్థితిపై ప్రకటన చేశారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు.
షారూక్ తన తదుపరి యాక్షన్-థ్రిల్లర్ కింగ్‌లో కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి నటించనున్నాడు. ఈ చిత్రంలో అండర్ వరల్డ్ డాన్‌గా కనిపించబోతున్నాడు. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై వరల్డ్ లో భాగంగా టైగర్ వెర్సెస్ పఠాన్‌లో పఠాన్ పాత్రను రిపీట్ చేయబోతున్నాడు.