ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు. కౌంటింగ్ కి చాలా సమయం ఉంది. అయితే ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఉత్తరాంధ్రలో వెనకబడిన శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఈసారి గెలుపుతో హ్యాట్రిక్ కొడతాను అని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ధీమాగా ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కూడా ఈసారి వినూత్నంగా సాగింది.
గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు అని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈసారి టీడీపీ ఎన్డీయేలో చేరింది కాబట్టి మోడీ మరోసారి గెలిస్తే ఆయన నాయకత్వంలో మూడవసారి ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి టీడీపీ కోటాలో మంత్రి పదవులు ఖాయమని అని ప్రచారం సాగుతోంది.
అలా టీడీపీకి వచ్చే మంత్రి పదవులలో ఉత్తరాంధ్ర నుంచి ఒకటి గ్యారంటీ అని అది ఆ పార్టీకి చంద్రబాబుకు పూర్తి విధేయత చూపించే రామ్మోహన్ నాయుడు కే దక్కుతుందని అని అంటున్నారు. 2014లో కేంద్ర క్యాబినెట్ లో టీడీపీ చేరినపుడు కూడా ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం కల్పించారు. అపుడు విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇచ్చారు.
ఈసారి ఆయన పోటీ చేయడంలేదు. రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించేశారు. దాంతో ఈ చాన్స్ బీసీ నేత యువకుడు అయిన రామ్మోహన్ కి వెళ్తుందని అంటున్నారు. ఏపీలో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అపుడు మంత్రి పదవి బాబాయ్ అచ్చేన్నాయుడుకు ఇస్తారా అంటే అబ్బాయికి బెర్త్ ఖాయం అయితే బాబాయ్ కేవలం పార్టీ ప్రెసిడెంట్ గానే ఉంటారు అని అంటున్నారు.
ఏపీలో అధికారంలోకి టీడీపీ రాకపోయినా కేంద్రంలో మోడీ ఖాయం కాబట్టి అలాగే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ విజయం తధ్యం కాబట్టి మంత్రి అయ్యేది నూరు శాతం అబ్బాయే అని అంటున్నారు.