సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని స్థాపించి ఈసారి ఎన్నికల గోదాలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ. జాతీయ పార్టీగానే రిజిస్టర్ చేశారు. ఈసారి ఏపీతో పాటు తెలంగాణలోనూ కొన్ని ఎంపీ సీట్లకు పోటీ చేశారు. జేడీ అయితే విశాఖ ఉత్తరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు
ఆయన పార్టీ ఎవరితో పొత్తులు లేకుండా ఏపీలో విడిగానే చేసింది. తెలంగాణలో అదే జరిగింది. అయితే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్రంగా బీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించింది.
నల్గొండ వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి జై భారత్ నేషనల్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లుగా లక్ష్మీనారాయణ ప్రకటించారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు రావాలని తాను ఎపుడూ కోరుకుంటాను అని చెప్పారు. అందుకే రాకేష్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ప్రకటించారు.
బీఆర్ఎస్ అభ్యర్ధికి లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించడం పట్ల చర్చ సాగుతోంది. ఆయన గతంలో బీఆర్ఎస్ తరఫున ఏపీ నుంచి రాజకీయాలు చేస్తారు అని ప్రచారం సాగింది. ఆ పార్టీ తెలంగాణలో గెలిచి ఉంటే ఏపీలో పోటీ చేసేది. అపుడు ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా జేడీ పోటీకి దిగుతారు అని కూడా ప్రచారం సాగింది. కానీ అవనీ ఉత్తివే అని తరువాత కొట్టి పారేశారు. ఇపుడు బీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించడం మాత్రం చూస్తూంటే రానున్న రోజులలో జేడీ పార్టీ కొత్త పొత్తుల ఎత్తుల దిశగా సాగుతుందా అన్న డిస్కషన్ అయితే సాగుతోంది.