సంక్రాంతి సినిమాలైనా మిస్ ఫైర్ అవుతున్నాయేమో కానీ, ఏటా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మాత్రం కొన్ని తప్పనిసరిగా సక్సెస్ అవుతున్నాయి. అలా ప్రతి ఏడాది టాలీవుడ్ కు ఫిబ్రవరి నుంచి కొన్ని హిట్ సినిమాలు అందుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. ఫిబ్రవరిలో వచ్చిన భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా, టైటిల్ కు తగ్గట్టు హిట్ అనిపించుకోకపోయినా, యావరేజ్ హిట్ గా నిలిచింది హిట్. జాను, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు అంచనాల్ని అందుకోలేకపోయాయి.
ఫిబ్రవరి మొదటివారంలో జాను సినిమా వచ్చింది. తమిళ్ లో కల్ట్ లవ్ స్టోరీగా పేరుతెచ్చుకున్న 96 సినిమాకు రీమేక్ ఇది. అదే మేజిక్ తెలుగులో కూడా రిపీట్ అవుతుందని దిల్ రాజు గంపెడాశలు పెట్టుకున్నాడు. అదే ఆశతో సమంత-శర్వానంద్ కూడా ఈ సినిమా చేశారు. కానీ క్లాసిక్స్ టచ్ చేయకూడదనే విషయాన్ని జాను మరోసారి రుజువుచేసింది. శర్వానంద్, సమంతను పెర్ఫార్మెన్సుల పరంగా వంక పెట్టడానికేం లేకపోయినప్పటికీ ఈ కథ టాలీవుడ్ కు సూట్ కాదనే విషయాన్ని యూనిట్ తెలుసుకుంది. అలా భారీ అంచనాల మధ్య వచ్చిన జాను ఫ్లాప్ అయింది.
జానుతో పాటు వచ్చిన సవారి, 3 మంకీస్, డిగ్రీకాలేజ్, స్టాలిన్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. వీటిలో సవారీ సినిమాపై నందు బాగా నమ్మకం పెట్టుకున్నాడు. ఎమోషనల్ కూడా అయ్యాడు. కానీ జనాలకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఇక హాట్ హాట్ సీన్లతో డిగ్రీకాలేజ్ రిలీజ్ కు ముందు ఆకట్టుకున్నప్పటికీ.. రిలీజ్ తర్వాత తేలిపోయింది.
జాను కంటే భారీ అంచనాలతో వచ్చింది వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా విడుదలైన రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ గడిచేసరికి అతడి కెరీర్ లోనే మరో డిజాస్టర్ మూవీగా తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిజల్ట్, దేవరకొండ కెరీర్ ను షేక్ చేసింది. ఓ సినిమాను కూడా అతడు వదులుకోవాల్సి వచ్చింది. ఈ మూవీతో పాటు వచ్చిన ఒక చిన్న విరామం, లైఫ్ అనుభవించు రాజా, శివ 143 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
ఇలా ఫిబ్రవరి మొదటి 2 వారాలు డల్ గా సాగుతున్న టైమ్ లో వచ్చాడు భీష్మ. భారీ అంచనాలతో వచ్చిన జాను, వరల్డ్ ఫేమస్ లవర్ అంచనాల్ని అందుకోలేక చతికిలపడితే.. నితిన్ మాత్రం భీష్మతో అంచనాల్ని అందుకోవడమే కాకుండా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో, ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాతో పాటు వచ్చిన ప్రెషర్ కుక్కర్, వలయం, చీమ ప్రేమ మధ్యలో భామ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఇక ఫిబ్రవరి ఆఖరి వారంలో కూడా సినిమా సందడి కొనసాగింది. ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో అంచనాలతో వచ్చిన సినిమా హిట్ మాత్రమే. నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా ఓ సెక్షన్ ఆడియన్స్ కు నచ్చినప్పటికీ.. అనుకున్న టార్గెట్ ను మాత్రం హిట్ చేయలేకపోయింది. ఫలితంగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
అయితే హిట్ తో పాటు డబ్బింగ్ సినిమాగా వచ్చిన కనులు కనులను దోచాయంటే అనే మూవీ మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. దుల్కర్, రీతూ వర్మ కెమిస్ట్రీ కూడా వర్కవుట్ అయింది. డీసెంట్ థ్రిల్లర్ అనిపించుకున్నప్పటికీ.. పబ్లిసిటీ లేకపోవడం, స్టార్ ఎప్పీయరెన్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా థియేటర్లలో నిలబడే అవకాశాలు తక్కువ. ఇక ధనుష్ నటించిన లోకల్ బాయ్, కొత్త దర్శకుడు తీసిన రాహు, సింగర్ మంగ్లీ నటించిన స్వేచ్ఛ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఇలా ఫిబ్రవరి నెలలో అటుఇటుగా 18 సినిమాలు రిలీజ్ అవ్వగా.. వాటిలో భీష్మ మాత్రమే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. హిట్ సినిమా యావరేజ్ గా నిలిచింది. వరల్డ్ ఫేమస్ లవర్, జానుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు అందరి చూపు మార్చి నెలలో రాబోతున్న “వి” సినిమాపై పడింది.