తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తమ సొంత పార్టీ నాయకుడికే.. లక్ష రూపాయల జరిమానా విధించాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆయన ఆదేశించారు. అదికూడా ఎంతపెద్ద తప్పు చేసినందుకో.. అని సందేహించాల్సిన అవసరం లేదు. తన రాక సందర్భంగా.. వద్దన్నా వినకుండా.. తన బొమ్మలతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు వేసినందుకు.. సొంత పార్టీకే చెందిన నాయకుడికి ఈ శాస్తి చేశారు కేటీఆర్. నెటిజన్లు అందరూ ఇప్పుడు కేటీఆర్‌ను శెభాష్ అంటున్నారు. ఇదే స్ఫూర్తి సదా ఉండాలని కూడా ఆకాంక్షిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. మునిసిపల్ మంత్రి కేటీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఇల్లెందులో ఒక బహిరంగసభలో పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు కేటీఆర్.. తమ ఊరికి వస్తుండేసరికి.. అక్కడి నాయకులకు ఉత్సాహం పొంగుకొచ్చింది. తమ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఊరంతా కేటీఆర్ బొమ్మలతో పెద్దపెద్ద ఫ్లెక్సిలు ఏర్పాటు చేయించారు. ఇల్లెందు మునిసిపాలిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితికే చెందిన దమ్మాలపాటి వెంకటేశ్వర్లు స్వయంగా పూనుకుని నాయకుడిని స్వాగతిస్తూ ఫ్లెక్సిలు పెట్టారు.
పార్టీ అధ్యక్షుడు కేటీఆర్.. ఈ స్వాగత సంరంభాలకు ప్రసన్నం కావడం సంగతి దేవుడెరుగు.. ఆగ్రహోదగ్రులయ్యారు. వద్దన్నా వినకుండా ఫ్లెక్సిలు వేసినందుకు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు రూ.లక్ష జరిమానా విధించి వసూలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆదేశించారు. పైగా ఫ్లెక్సి లతో చేసే ఆర్భాటాల ద్వారా నాయకులు కాలేరని, ప్రజలకు సేవచేస్తూ వారి గుండెల్లో ఉండేవారే నిజమైన నాయకులని వేదికమీదినుంచే క్లాసు తీసుకున్నారు.
కేటీఆర్ ప్రదర్శించిన స్ఫూర్తి శెభాషనిపించుకునేలా గొప్పగానే ఉంది. కానీ.. ఇదే స్ఫూర్తిని ఆయన సదా చూపించాలి. హైదరాబాదు నగరంలో వ్యాపారపరంగా కమర్షియల్ హోర్డింగులు అనేకం ఉంటుంటాయి. కేసీఆర్ జన్మదిన, పార్టీ బహిరంగ సభలు వంటివి వచ్చినప్పుడు.. వాటన్నింటినీ రాజకీయ ఫ్లెక్సిలు కబ్జా చేసేస్తుంటాయి. కేటీఆర్ ఇదే తరహాలో ప్రతిచోటా కత్తి ఝుళిపించి.. పార్టీ నాయకులకు ఫ్లెక్సిల విషయంలో ఒక జడుపు పుట్టిస్తే గనుక.. ఆయనకు ప్రజల్లు సత్కీర్తి లభిస్తుంది.