పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలివిడత సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలతో ముడిపడిన జగన్ నిర్ణయాల పరిస్థితి ఏమిటి? అనే చర్చ సర్వత్రా నడుస్తున్నది. జగన్ కల తీరుతుందా? ఇంకా తదుపరి సమావేశాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందా? అనేది కీలకం! ప్రస్తుత సెషన్ ఏప్రిల్ 3వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో.. అన్ని బిల్లులను చర్చించడానికి అవసరమైనంత వ్యవధి ఉన్నట్లే! కానీ దేశమంతా కార్చిచ్చులా రగులుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో పార్లమెంటు సభా కార్యక్రమాలు ఎంత సజావుగా సాగుతాయనేది అనుమానంగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముందడుగు వేయడానికి హస్తినాపురంలో తాత్కాలిక ప్రతిబంధకాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి.. శాసనసభ తీర్మానం చేసిన తర్వాత.. దానిని కేంద్రం ఆమోదించాలి. నోటిఫై చేయాలి. కాకనీ.. శాసనసభా తీర్మానం అనేదే ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది. మండలి అడ్డుపుల్ల వేసింది. జగన్ ఏకంగా మండలినే రద్దు చేసేస్తూ శాసనసభలో తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపారు. ఢిల్లీ వెళ్లి ప్రభుత్వంలోని పెద్దలను కలిసినప్పుడు కూడా మండలి రద్దు తీర్మానం ఈ పార్లమెంటుసమావేశాల్లోనే ఆమోదం పొందేలా సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.
కానీ పార్లమెంటులో అనేక రగడల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు వ్యవహారం చర్చకు వస్తుందా? పార్లమెంటు ఆమోదం పొందుతుందా? అనేది కీలకం కానుంది. మండలి రద్దు ఈ సమావేశాల్లో జరగకపోతే గనుక.. జగన్ మరింత కాలం నిరీక్షించాలి. మండలిని అడ్డు తొలగించుకుంటే తప్ప ప్రస్తుతానికి అధికార వింకేంద్రీకరణ అడుగు ముందుకు పడదు. ఒకవేళ మండలి రద్దు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందకుంటే.. మూడునెలలపాటు ఆగాలి. ఈలోగా మండలి సెలక్ట్ కమిటీ వ్యవహారం ఏదో ఒకటి తేలిపోతే.. మండలి రెండోసారి రిజెక్ట్ చేసినా కూడా అధికార వికేంద్రీకరణ బిల్లు శాసనసభ పునః ఆమోదంతో చట్టం అయిపోతుంది. తర్వాత దానిని కేంద్రానికి పంపవచ్చు.
ఇలాంటి నేపథ్యంలో.. ఈ పార్లమెంటు సమావేశాల్లో జగన్ కల తీరుతుందా? లేక, మరింతకాలం నిరీక్షించాల్సి వస్తుందా? అనే సంగతి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది.