ఒవైసీ తొందర పడ్డారా? అతి చేశారా?

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం అనేది అత్యంత సహజమైన విషయం. తాజా పరిణామాల్లో సీఏఏ, ఎన్నార్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతున్న వేళ.. అసదుద్దీన్ ఒవైసీ…

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం అనేది అత్యంత సహజమైన విషయం. తాజా పరిణామాల్లో సీఏఏ, ఎన్నార్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతున్న వేళ.. అసదుద్దీన్ ఒవైసీ కూడా.. ఆ పోరాటాలకు మద్దతుగా నిలుస్తున్నారు. తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ బిల్లులకు వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే.. ఆయన గుంటూరులో కూడా సభ నిర్వహించారు. ఆ సభలో ఒవైసీ తొందరపడ్డారని లేదా అతి చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గుంటూరు సభలో ఒవైసీ మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి సర్కారు ఎన్నార్సీ సీఏఏలకు వ్యతిరేకంగా తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలంటూ ఫత్వా జారీచేశారు. అయితే ఆ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచన ఏమిటో ఆయన స్పష్టంగా తెలుసుకోకుండానే.. జగన్ అలా చేయకపోతే గనుక.. రాష్ట్రంలోని ముస్లిం సమాజం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలని పిలుపు ఇచ్చారు. సీఎం జగన్ ప్రధాని మోడీకి భయపడుతున్నారంటూ నింద వేశారు. ఇవన్నీ కూడా ఒవైసీ తొందరపాటుగానే విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ విషయంలో రాజశేఖర రెడ్డితో పోలుస్తూ.. ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గనుక జీవించి ఉంటే ఆయన సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించి ఉండేవారని ఒవైసీ వ్యాఖ్యానించడం అతిగానే ఉంది. మరణించిన వ్యక్తితో పోలుస్తూ.. అప్పటికీ ఇప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ను నిందించడానికి సామ్యం తేవడం అనే చవకబారు టెక్నిక్.. ఒవైసీ సొంత తెలివితేటలు కాదు. కొన్నాళ్ల కిందట ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాధ్ కూడా ఇదే మాట అన్నారు.

పౌరసత్వ సవరణ అనేది చట్టం రూపం దాల్చినప్పుడు ముస్లిం సమాజంలో కూడా ఇన్ని భయాలు లేవు. స్వదేశీ భారతీయ ముస్లింలకు దానివల్ల ప్రమాదం అనే భావన వారిలోనూ ఆనాడు లేదు. కానీ ఎన్నార్సీ మీద తొలినుంచి అభ్యంతరాలనున్నాయి. నిజానికి ఆ రెండింటి స్వరూపాలు వేరు వేరు. ఉద్యమాలు మొదలైన తర్వాత.. రెండింటినీ ఒకే గాటన కట్టేశారు. సీఏఏకు వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభలో మద్దతిచ్చింది గానీ.. ఎన్నార్సీ విషయంలో తమ వైఖరిని తేల్చలేదు. వారు దానికి మద్దతిస్తున్నారనే ప్రకటనే ఏదీ లేకుండానే.. ఒవైసీ, జగన్ మీద నిందలు వేయడానికి పూనుకోవడం తొందరపాటు కాక మరేమిటి?

ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వ్య‌క్తి చిరంజీవి