గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందుకు ఒక కండిషన్ ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా.. తీర్మానం జరుగుతుందని.. ప్రభుత్వం అలా తీర్మానం చేయకపోతే గనుక.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముస్తఫా ప్రకటించారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ వ్యవహరించదనే నమ్మకం తనకున్నదని ముస్తఫా ప్రకటించారు.
అయితే ముస్తఫా ఇలాంటి తీవ్రమైన ప్రకటన చేయడానికి పార్టీ అనుమతి ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే.. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించడమా? మద్దతివ్వడమా? అనేది పార్టీ విధాన నిర్ణయం. విధాన నిర్ణయాల విషయంలో ఒక సాధారణ ఎమ్మెల్యే పార్టీ మీద ఒత్తిడి తేవడం అనేది అనూహ్యమైన సంగతి. జగన్ మాటకు ఎవ్వరూ ఎదురుచెప్పే అలవాటే లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఇలా పార్టీ మనోగతం తెలుసుకోకుండా.. ఏకంగా పార్టీపై ఒత్తిడి తెచ్చేలా.. అవసరమైతే రాజీనామా చేస్తా అని ప్రకటించడం ఊహించలేము.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడానికి బేషరతుగా మోడీ సర్కారుకు సహకరించింది. రాజ్యసభలో ఆ బిల్లు నెగ్గడానికి తోడ్పాటు అందించింది. ఇవాళ… దానిని వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేయకపోతే గనుక.. రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యేకు ఆరోజున తమ పార్టీనే మద్దతిచ్చిన సంగతి తెలియదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఆయన సీరియస్ గానే.. రాజీనామా ప్రకటన చేశారా? లేదా, సీఏఏ కు వ్యతిరేకంగా జరుగుతున్న బహిరంగసభ కాబట్టి.. ఏదో సభారంజకంగా సభికుల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి తీవ్రమైన ప్రకటన చేశారా? అనేది తెలియని సంగతి. పార్టీ ఢిల్లీలో సీఏఏకు మద్దతిచ్చినప్పటికీ.. క్రమంగా వారిలో వ్యతిరేక స్వరం బాగానే వినిపిస్తోంది.
ఇటీవల మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఏఏ బిల్లు ముస్లింలకు హానికరం కాదని ప్రభుత్వం చెపినందునే తాము రాజ్యసభలో సహకరించామని, అవసరమైతే ఎన్నార్సీకి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇవాళ ఎమ్మెల్యే ముస్తఫా అసెంబ్లీ తీర్మానం చేయకపోతే గనుక.. తాను ఏకంగా పదవికే రాజీనామా చేస్తానని అంటున్నారు. పార్టీ నాయకుల ఆగ్రహావేశాలకు- పార్టీ విధానాలకు మధ్య ప్రతిష్టంభనగా మారిన ఈ పరిణామాలు.. ఎలా మలుపులు తిరుగుతాయో వేచిచూడాలి.