తన సినిమాల్లో పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు దర్శకుడు శంకర్. ప్రతి పాట ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. అవసరమైతే దేశాలు చుట్టేస్తాడు, లేదంటే స్పెషల్ సెట్ వేస్తాడు, బడ్జెట్ సహకరిస్తే కొత్త టెక్నాలజీని సైతం పరిచయం చేయడానికి చూస్తాడు. తన కొత్త సినిమా ఇండియన్-2కు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. అయితే ఈసారి పాటలకే కాదు, ఫైట్స్ విషయంలో కూడా భారీతనం, కొత్తదనం చూపించబోతున్నాడు ఈ డైరక్టర్.
కమల్ హాసన్ హీరోగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇండియన్-2 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడు శంకర్. ఇదొక ట్రయిన్ ఫైట్.
విదేశీ టెక్నీషియన్స్ సహకారంతో భారీ ఎత్తున ఈ ట్రయిన్ ఫైట్ ను తీయబోతున్నాడు శంకర్. సినిమాకు ఇది మెయిన్ ఎట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం వచ్చే వారం యూనిట్ మొత్తం దక్షిణాఫ్రికా వెళ్తోంది. అక్కడే 2 వారాల పాటు ఈ ట్రయిన్ ఫైట్ తీస్తారు.
శంకర్ కు ట్రయిన్ ఫైట్స్ కొత్తకాదు. రోబో సినిమాలో కూడా ఓ ట్రయిన్ ఫైట్ ఉంది. అయితే ఇండియన్-2లో ట్రయిన్ ఫైట్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో తీయబోతున్నారు.
ఇండియన్-2లో సాంగ్స్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని శంకర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాటలతో పాటు, ఫైట్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయనే విషయం బయటకొచ్చింది.