టాలీవుడ్ లో అప్పుడే ఓ త్రైమాసికం ముగిసింది. ఈ 3 నెలల్లో సినిమా ఫలితాలేంటో కూడా చూశాం. మరి రాబోయే నెలల్లో టాలీవుడ్ పరిస్థితేంటి? గతేడాదిలా ఈసారి ఎలాంటి బాక్సాఫీస్ క్లాష్ లు లేవు, అటుఇటు మారడాలు అంతకంటే లేవు. ప్రతి నెలా ఓ క్రేజీ సినిమాకు కేటాయించారు. పక్కా ప్రణాళికతో సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
వచ్చేనెల ఏప్రిల్ లో పెద్ద సినిమా శాకుంతలం, ఏజెంట్, రావణాసుర లాంటి పెద్ద సినిమాలొస్తున్నాయి. ఇవన్నీ చాన్నాళ్ల కిందటే రిలీజ్ డేట్స్ విషయంలో ఓ అవగాహనకు వచ్చాయి. ముందుగా రావణాసుర వస్తుంది. చివర్లో ఏజెంట్ వస్తుంది. మధ్యలో శాకుంతలం రిలీజ్ అవుతుంది.
ఇక మే నెలలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి మాత్రమే. అదే కస్టడీ. నాగచైతన్య చేస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ఇది. జూన్ నెలలో ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓసారి వాయిదాపడిన ఈ సినిమా రిలీజ్ పై ఇంకా అనుమానాలున్నప్పటికీ, జూన్ టార్గెట్ ను యూనిట్ రీచ్ అయ్యేలా కనిపిస్తోంది.
జులైలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న వినోదాయశితం రీమేక్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇక ఆగస్ట్ లో చిరంజీవి చేస్తున్న భోళాశంకర్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
సెప్టెంబర్ లో 2 పెద్ద సినిమాలున్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్, విజయ్ దేవరకొండ-సమంత కలిసి చేస్తున్న ఖుషి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అక్టోబర్ లో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది వచ్చినా రాకున్నా, బాలయ్య, అనీల్ రావిపూడి కలిసి చేస్తున్న సినిమా మాత్రం కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే, దసరా సీజన్ బాలయ్యకు సెంటిమెంట్ కాబట్టి.
ఇలా ఏప్రిల్ నుంచి ప్రతి నెల ఓ క్రేజీ మూవీ థియేటర్లలోకి వస్తోంది. వీటిలో ఏ సినిమా అంచనాల్ని అందుకుంటుందో చూడాలి.