హృతిక్, సల్మాన్ సినిమాల్ని దాటేసిన గదర్-2

గదర్-2 సినిమా వేడి బాక్సాఫీస్ బరిలో ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ సినిమాను వేలంవెర్రిగా చూస్తున్నారు. ఏరోజుకారోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతోంది తప్ప, తగ్గినట్టు…

గదర్-2 సినిమా వేడి బాక్సాఫీస్ బరిలో ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ సినిమాను వేలంవెర్రిగా చూస్తున్నారు. ఏరోజుకారోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతోంది తప్ప, తగ్గినట్టు ఎక్కడా దాఖలాల్లేవు. ఈ క్రమంలో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించింది.

రెండో శనివారం అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇన్నాళ్లూ బాహుబలి-2 హిందీ వెర్షన్ పేరిట రికార్డ్ ఉండేది. విడుదలైన తర్వాత రెండో శనివారం బాహుబలి-2 హిందీ వెర్షన్ కు 26.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడీ రికార్డ్ ను గదర్-2 క్రాస్ చేసింది. నిన్నటి రోజున ఈ చిత్రానికి ఏకంగా 32 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ఇక తన బాక్సాఫీస్ రన్ లో భాగంగా శనివారం నాటికి హృతిక్ నటించిన వార్, సల్మాన్ చేసిన భజరంగీ భాయ్ జాన్ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్ ను అధిగమించింది గదర్-2. ఇవాళ్టి వసూళ్లతో టైగర్ జిందాహై, పీకే, సంజు సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఇది క్రాస్ చేయబోతోంది.

ఇక సోమ, మంగళవారం నాటి కలెక్షన్లతో ఈ సినిమా కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ ను అధిగమించే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ భావిస్తోంది. బాలీవుడ్ లో అత్యథిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా కొనసాగుతోంది కేజీఎఫ్-2.

ఓవరాల్ గా గదర్-2 వసూళ్లు చూస్తే.. నిన్నటి కలెక్షన్లతో కలిపి ఈ సినిమాకు ఇండియాలో 336 కోట్ల 20 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరో వారం రోజుల పాటు ఈ సినిమా హవా కొనసాగుతుందని అంటోంది ట్రేడ్.