రాజేంద్రప్రసాద్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ సినిమా అది. స్టార్ డైరక్టర్ అనీల్ రావిపూడికి తెగ నచ్చి 'సమర్పించు'కున్న సినిమా అది. కేవలం సమర్పించుకుంటే సరిపోదనుకున్నాడు అనీల్ రావిపూడి. ఏకంగా దానికి స్క్రీన్ ప్లే సమకూర్చి, దర్శకత్వ పర్యవేక్షకుడి అవతారం కూడా ఎత్తేశాడు. రిలీజ్ కు ముందు ఇలా చాలా హంగామా చేశాడు ''గాలి సంపత్''.
ఎప్పుడైతే సినిమా థియేటర్లలోకి వచ్చిందో మొదటి ఆటకే తెలిసిపోయింది. సినిమా గాల్లో కలిసిపోయింది. ఇదంతా జరిగి అటుఇటుగా 5 నెలలు అవుతుంది. మరి ఇప్పుడెందుకు? అక్కడికే వస్తున్నాం. థియేట్రికల్ గా డిజాస్టర్ అయిన ఈ సినిమా బుల్లితెర వీక్షకుల్ని మాత్రం మెస్మరైజ్ చేస్తుందని కొందరు కలలుకన్నారు. చూస్తూ ఉండండి ఈ సినిమా ''బుల్లి ప్రభంజనం'' సృష్టిస్తుందన్నారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.
థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్న ఈ సినిమా టీవీల్లో కూడా దాదాపు అదే స్థాయి టీఆర్పీ అందుకుంది. తొలిసారి టీవీల్లో ప్రసారం చేసిన ఈ సినిమాకు జస్ట్ 3.9 టీఆర్పీ మాత్రమే వచ్చింది. తాజా రేటింగ్ తో గాలిసంపత్ అపజయం పరిపూర్ణమైంది.
అనీష్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఫి..ఫి..ఫి భాష మాట్లాడారు. ఇది పండకపోగా.. శ్రీకాంత్ అయ్యంగర్, అనీష్ కురువిల్ల ట్రాక్ సిల్లీగా అనిపిస్తుంది. లాజిక్స్ ను గాలికొదిలేసిన గాలి సంపత్ ను వెండితెర, బుల్లితెర ప్రేక్షకులిద్దరూ గాలికొదిలేశారు.