cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: టక్ జగదీష్

మూవీ రివ్యూ: టక్ జగదీష్

టైటిల్: టక్ జగదీష్
రేటింగ్: 2.75/5
తారాగణం:
నాని, రీతూ వర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, ఐశ్వర్య రాజేష్, నాజర్, జగపతి బాబు, డెనియల్, తిరువీర్ తదితరులు 
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల 
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి 
సంగీతం: తమన్ (పాటలు), గోపీ సుందర్ (నేపథ్యం) 
కథ-దర్శకత్వం: శివ నిర్వాణ 
విడుదల తేదీ: 9 సెప్టెంబర్, 2021
ఓటీటీ: అమెజాన్ ప్రైం 

ఎప్పటినుంచో మీడియాలో నానుతున్న నాని సినిమా టక్ జగదీష్. టీజర్లు, ట్రైలర్లు రావడం ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ మీద పడడంతో వాయిదా పడి ఎట్టకేలకి ఓటీటీ ఎక్కి మన ముందుకొచ్చింది. 

నిన్నుకోరి, మజిలి లాంటి సినిమాలు తీసిన శివ నిర్వాణ దీనికి దర్శకుడు. ఇంతకీ ఏవిటా టక్ కథ? ఎవ్వరా జగదీష్? కథలోకి వెళ్దాం.

భూదేవిపురంలో ఆదిశేషు నాయుడు (నాజర్) కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోతుంది. ఆమెకు కలిగిన సంతానం బోసు (జగపతి బాబు), జగదీష్ (నాని).  రెండవ భార్య కి ఇద్దరు కూతుళ్లు (రోహిణి, దేవదర్శని చేతన్), ఒక కొడుకు. 

పైన చెప్పుకున్న జగదీష్ కి టక్ చేసే అలవాటు. ఆ టక్కుని ఎవరన్నా లాగితే కోపమొస్తుంది. అంతకు మించి తనకి, టక్కుకి పెద్ద సంబంధమేమీ లేదు. 

ఆ ఊరికి గుమ్మడి వరలక్ష్మి (రీతూ వర్మ) వి.ఆర్.వో గా వస్తుంది. ఆమెకి, జగదీష్ కి లవ్ ట్రాక్ నడుస్తుంటుంది. ఇదిలా ఉంటే ఆ ఊరిలో వీరేంద్ర (డేనియల్ బాలాజి) ఒక మోతుబరి. ఊరి రాజకీయాల్లో తిరుగులేకుండా ఉండాలనుకుంటాడు. ఈ వీరేంద్ర కుటుంబానికి, ఆదిశేషునాయుడు కుటుంబానికి పడదు. ఎమ్మార్వోతో కుమ్మక్కయ్యి వీరేంద్ర పేదల భూముల్ని కాజేస్తుంటాడు. 

ఆదిశేషు నాయుడు మరణంతో బోసు అసలు స్వరూపం బయటపడుతుంది. వీరేంద్రతోటి, ఎమ్మార్వోతోటి తాను కూడా కుమ్మక్కయ్యి ఆస్తి మొత్తం సవితితల్లి పిల్లలకి చెందకుండా మొత్తం తనే లాక్కుంటాడు. 

ఆ అన్యాయానికి జగదీష్ ఎలా అడ్డుపడతాడు? సవితి తల్లి పిల్లల సమస్యల్ని ఎలా గట్టెక్కిస్తాడు అనేది కథ. 

టైటిల్ ని బట్టి, హీరోని బట్టి ఇదేదో కామెడీ సినిమా అనుకునే అవకాశం లేకపోలేదు. కానీ ఇది పల్లె నేపథ్యంలో నడిచే యాక్షన్ సినిమా. ఎన్.టి.ఆర్ కి ఒక "అరవింద సమేత" లాగ, అల్లు అర్జున్ ని ఒక "సన్నాఫ్ సత్యమూర్తి" లాగ నాని కి "టక్ జగదీష్" అన్నమాట. 

పేరుకి టక్ జగదీష్ కానీ ఆ టక్కుతో పెద్దగా డ్రామా ప్లే చేసింది లేదు. ఇందులో హీరో టక్ చేసుకున్నా, చేసుకోకపోయినా కథకొచ్చే ఇబ్బందేమీ లేదు. ఒకానొక సిన్సియర్ ప్రభుత్వాధికారిని చిన్నప్పుడు టక్కులో చూసి పెద్దయ్యాక టక్ చేసుకుని ప్రభుత్వాధికారి అవ్వాలనుకుంటాడు జగదీష్. నానీ చేత ఈ డయలాగ్ చెప్పించి దానినే టైటిల్ జస్టిఫికేషన్ అనుకోమన్నారు. మొదట్లో చెప్పినట్టు కనీసం ఫైటింగుల్లోనైనా ఎవ్డన్నా టక్కు మీద చెయ్యేస్తే కోపమొచ్చినట్టుగా మళ్లీ చూపించలేదు. ఫైటింగులు కూడా పాత సినిమాల్లో కృష్ణ, శోభన్ బాబు లాగ టక్కు చెదరకుండా చెసడు నాని. 

నానికి స్టార్డం పెంచే ప్రయత్నం ఈ కథ, కథనం, ట్రీట్మెంట్ తో జరిగాయి. "అల వైకుంఠపురంలో" లో చిత్తరాల సిరపడు పాట లాగ ఇందులో కూడా నాని చేసే ఒక ఫైట్ కి పాట పెట్టారు. అలాగే క్లైమాక్స్ అయిపొయాక రోలింగ్ టైటిల్స్ ముందు రీతు చేత చెప్పించిన ఒక డయలాగ్ కూడా నాని మాస్ అప్పీల్ ని పెంచే ప్రయత్నమే. 

కథని బరువుగా రాసుకుని, స్క్రీన్ ప్లే ని బిగుతుగా బిగించి శ్రద్ధగా తీసిన సినిమా ఇది. అయితే తీసుకున్న కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ లో బాగుండచ్చేమో గానీ ఓటీటీలో పంటి కింద రాళ్లులా ఉన్నాయి. 

ఎమ్మార్వో కి పైన, పక్కన ఇంకెవ్వరూ ఉండరు అనే ఫీలింగుతో చూడాలి ఈ సినిమాని. అప్పుడే బాగుంటుంది. అంత సడెన్ గా గవర్న్మెంట్ ఆఫీసర్ ఎలా అయ్యడనే ప్రశ్న రాకూడదు. వచ్చిన అది ఫక్తు కమర్షియల్ సినిమా ట్రీట్మెంట్ అని సరిపెట్టుకోవాలి. 

అలాగే ఐశ్వర్యా రాజేష్ కి ప్రమాదం అనిపిస్తే రెడ్ లైట్ వేస్తే ప్రత్యక్షమైపోతానని నాని చెప్పడం ట్రాక్ హాస్యాస్పదంగా ఉంది. సెల్ ఫోన్స్ రోజుల్లో కూడా ఈ లైట్ వేసి సిగ్నల్ ఇవ్వడాలేవిటో! 

కథనంలో భాగంగా వినిపించే మాంటాజ్ సాంగ్స్ పర్వాలేదు కానీ కథనాన్ని ఆపి మధ్యలో దూరే రొటీన్ పాటలు సినిమాని ఫాస్ట్ ఫార్వార్డ్ చేయిస్తాయి. 

ఏది ఏమైనా నటనపరంగా నాని పర్ఫెక్ట్ గా సెట్టైపోయాడు. గుమ్మడి వరలక్ష్మిగా రీతు వర్మకి పెద్ద పనికొచ్చే పాత్రైతే కాదు. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉందన్నట్టుగా ఉంది. 

నటనకి స్కోపున్న పాత్రలో కనిపించి ప్రధానంగా ఆకర్షించిన నటి ఐశ్వర్య రాజేష్. జగపతిబాబు డబుల్ షేడ్ పాత్రలో మెప్పించాడు. తిరుమల నాయుడుగా తిరువీర్ సాడిస్ట్ భర్త పాత్రలో ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. మిగిలిన పాత్రలన్నీ ఓకే. 

సినిమాకి గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. తమన్ పాటలు జస్ట్ ఓకే అనిపించాయి. ఎడిటింగ్, కెమెరా లాంటి సాంకేతిక విలువలు, ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ పై స్థాయిలో ఉన్నాయి. 

పాత జాడీలో కొత్తావకాయ టైపులో ఇది పాత ఫార్ములాలో కొత్త ట్విస్టుల కథ. నిజానికి ఈ సినిమాలో కొత్తగా అనిపించేవి ట్విస్టులే. ఔటాఫ్ ద బాక్స్ సినిమా అని చెప్పుకోవడానికేమీ లేదు కానీ చూస్తున్నంతసేపు విసిగించకుండా కూర్చోబెట్టేలా ఉంది. దానికి ముఖ్యకారణం నాని. ఎటువంటి కథనైనా మోసే కెపాసిటీ తనకుందని మరొకసారి ప్రూవ్ అయ్యింది. 

బాటం లైన్: టక్కు నలగకపోయినా కథ బాగానే నలిగింది

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×