అవును మరి. నమ్మితేనే మోసమే. నమ్మారు కాబట్టే మోసపోతున్నారు అన్న లాజిక్ కూడా ఉందిక్కడ. మరి సామాన్యుడు మోసపోతే అది విశేషం కాదు, సర్వ సాధారణం. కానీ అదే చట్టాలు చేసే స్థాయి ఉన్న వారు కూడా మోసపోతే అది సంచలనమే అవుతుంది.
విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఇలాగే మోసపోయి ఒక సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. ఆయన విశాఖ సమీపంలోని కొమ్మాదిలో 12 ఎకరాల స్థలాన్ని ఒక మధ్య దళారీ నుంచి కొన్నారు. అది తన భూమే అనుకుని పాపం ఎమ్మెల్యే గారు దానికి జీపీయే రిజిష్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు.
ఆ తరువాత అసలు కధ మొదలైంది. తీరా ఆరా తీస్తే ఆ స్థలం అమెరికాలో నివాసం ఉంటున్న ఒక ఎన్నారైది. దాంతో ఆయన నా భూమిలో మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటి అంటూ పోలీసులను ఆశ్రయించారు. అపుడు సీన్ లోకి ఖాకీలు దిగితే టోటల్ కధ తెలిసింది.
ఈ భూమిని ఎవరో నకిలీ ఆసాములు బ్రోకర్లు ఎమ్మెల్యే రాజుకు అమ్మేశారని, నకిలీ పత్రాలు సృష్టించి నిండుగా మోసం చేశారని. మొత్తానికి ఎమ్మెల్యేవే ఇక్కడ బాధితుడు అయితే సగటు జనం సంగతేంటన్న ప్రశ్న రావచ్చు. చర్చ జరగవచ్చు.
ఇలాంటి భూభాగోతాలు చాలానే స్మార్ట్ సిటీలో స్మార్ట్ గా జరిగిపోతున్నాయి. పెద్ద వాళ్ళు అయితే విషయం బయటకు వస్తోంది. మామూలు జనాలు అయితే నెత్తిన కొంగేసుకుంటున్నారు. దీని మీద రెవెన్యూ, పోలీస్ విభాగాలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ కూడా గట్టిగా దృష్టి పెట్టకపోతే ఈ భూ మాయకు అడ్డూ అదుపూ ఉండదనే అంటున్నారు.
విశాఖలోనే కాదు, ఎక్కడ భూములు కొనాలన్నా కూడా తస్మాత్ జాగ్రత్త అనే అంటున్నారు అంతా.