ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఎక్కడైనా సర్వసాధారణం. కానీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలిసి కూడా ఓ ప్రాజెక్టును వదిలేస్తే ఎలా ఉంటుంది? నాని విషయంలో అదే జరిగింది. ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాలు వదిలేసుకున్నాడు ఈ హీరో. అవి సక్సెస్ అవుతాయని తనకు ముందే తెలుసు అంటున్నాడు.
“సూపర్ సక్సెస్ అవుతుందని తెలిసి కూడా వదిలేసిన సినిమాలున్నాయి. అందులో రాజా రాణి ఒకటి. నేను అట్లీని ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ అప్పుడు నేను పైసా, ఎటో వెళ్లిపోయింది మనసు చేస్తున్నాను. నాకోసం ఏడాది ఆగడం మంచిది కాదు అని నిర్మాతలకు చెప్పాను. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని, పెద్ద దర్శకుడు అవుతాడని కూడా చెప్పాను. అలానే అయింది. ఇక ఎఫ్ 2 కథ సైతం విన్న వెంటనే బ్లాక్ బస్టర్ అని చెప్పాను. అనిల్, దిల్ రాజు ఆ సినిమాను నాతో అనుకున్నారు. కానీ అది నా స్పేస్ కాదని అనుకున్నాను.”
ఇలా తను మిస్సయిన సూపర్ హిట్ సినిమాల్ని బయటపెట్టాడు నాని. అదే టైమ్ లో సూపర్ హిట్టవుతాయనుకున్న పైసా, ఆహా కల్యాణం లాంటి సినిమాలు ఆడలేదన్నాడు. ఈ రెండూ కాకుండా తన కెరీర్ లో V అనే మరో సినిమా కూడా ఉందని.. ఆ సినిమాను మంచి రివ్యూస్ రాలేదని, ఓటీటీ లో మాత్రం సూపర్ హిట్ అయిందని అంటున్నాడు. ఆ సినిమా హిట్టని చెప్పడానికి తన దగ్గర వివరణలు కానీ, కలెక్షన్లు కానీ లేవంటున్నాడు.
టక్ జగదీష్ సినిమాతో మరోసారి ఓటీటీలోకొస్తున్నాడు నాని. తన కెరీర్ లో ఓటీటీలో నేరుగా రిలీజయ్యే ఆఖరి సినిమా ఇదే అవ్వాలని కోరుకుంటున్న నాని, టక్ జగదీష్ అందరికీ నచ్చుతాడని అంటున్నాడు.